అసలే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు మార్కెట్ తక్కువగా ఉందంటే.. ఇప్పుడు కరోనాతో ఉన్న కాస్త ఆశలు కూడా అడుగంటిపోతున్నాయి. థియేటర్ల మొహం చూడకుండానే.. ఓటీటీకి వెళ్లిపోతున్నాయి హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు. దీంతో ఫ్యూచర్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. 

 

అనుష్క నుంచి కీర్తి సురేశ్ వరకు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ ఉన్నా.. లేడీ ఓరియెంటెడ్ మూవీ అనగానే మార్కెట్ లో ఒకరకమైన ఇమేజ్ ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కు పెద్దగా స్కోప్ ఉండదనీ.. అయితే హారర్ సినిమాలు.. లేదంటే రివేంజ్ స్టోరీస్ తప్ప మరొకటి కనిపించవనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఈ కేటగిరీ సినిమాలకు బిజినెస్ తక్కువగా జరుగుతుంటుంది. ఈ అభిప్రాయాలకు తోడు ఇప్పుడు కరోనా వచ్చి, హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ దెబ్బకొడుతోంది. 

 

లాక్ డౌన్ ఎత్తేసినా.. పోస్ట్ ప్రొడక్షన్ లకు, షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా.. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి అనేది క్లారిటీ లేదు. దీంతో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలను ఇంకా పెట్టెల్లో పెట్టడం భారంగా భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే కీర్తి సురేశ్ లీడ్ రోల్స్ ప్లే చేసిన రెండు సినిమాలు ఓటీటీ రిలీజ్ కు వెళ్తున్నాయి. 

 

మహానటి తర్వాత కీర్తి సురేశ్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తీయడానికి దర్శక నిర్మాతలు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. కీర్తి తెలుగు, తమిళ, మళయాళంలో ఉన్న గుర్తింపును క్యాష్ చేసుకోవడానికి సినిమాలు వరుసకట్టాయి. అలా సెట్స్ కు వెళ్లిన పెంగ్విన్, గుడ్ లక్ సఖి సినిమాలను థియేటర్లలోకి రాకుండా అడ్డుకుంటోంది లాక్ డౌన్. దీంతో ఈ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. 

 

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేదు. ఎక్కడ చూసినా అవే పరిస్థితులు. బోల్డంత అడ్వాన్స్ డ్ అని చెప్పుకునే బీటౌన్ లోనూ హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ అంటే చిన్నచూపే ఉంది. బడ్జెట్ నుంచి మార్కెట్ వరకూ అన్నింటా వ్యత్యాసం కనిపిస్తూనే ఉంది. ఇక లాక్ డౌన్ కూడా ఇలాగే హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ ని కొంచెం స్పెషల్ గా తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: