కాలం మరుతోంది. మనుషుల అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుత కాలంలో వస్తున్న మార్పులను గమనించి ముందుకెళ్లిన వారే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కరోనా వైరస్ విజృంభణ వల్ల ఇప్పటికే టాలీవుడ్ సినీ పరిశ్రమకు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. 

 

అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీల రాకతో వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. కథ, స్క్రీన్ ప్లే బాగుంటే కోట్లు పెట్టి కొంటూ ఉండటంతో నిర్మాతలు కూడా ఓటీటీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. భారీ నిర్మాణ సంస్థలు కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టడంతో భవిష్యత్తు వెబ్ సీరీస్ లదే అని సినీ వర్గాల్లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్ లకు పడే కష్టం తక్కువ కావడంతో నిర్మాతలు వీటిపై దృష్టి పెట్టారు. 

 

ప్రముఖ దర్శకుడు క్రిష్ హాట్ స్టార్ కోసం వెబ్ సిరీస్ తెరకెక్కిస్తుండగా పలు వెబ్ సిరీస్ లకు రచనా సహకారం అందిస్తున్నాడని తెలుస్తోంది. మరో దర్శకుడు తేజ ఒక ప్రముఖ సంస్థతో వెబ్ సిరీస్ లకు ఒప్పందం కుదుర్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది. భ‌విష్య‌త్తులో ట్రెండ్‌కు అనుగుణంగా పూరి వెబ్ సిరీస్‌ల్లో అడుగు పెట్ట‌బోతున్నాడని తెలుస్తోంది. వెబ్ సిరీస్‌ల విష‌యంలో పూరి నిర్మాత‌గానే వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని వార్తలు వినపడుతూ ఉండటం గమనార్హం. 

 

మరి వెబ్ సిరీస్ లకే నిజంగా భవిష్యత్తు ఉంటుందా...? అంటే కూడా చెప్పలేం. సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్ లకు రిపీట్ వాల్యూ తక్కువ. ప్రస్తుతం కరోనా విజృంభణ వల్ల సినిమాలకు కొన్నాళ్లు డిమాండ్ తగ్గినా భవిష్యత్తులో మాత్రం సినిమా పూర్వ వైభవాన్ని దక్కించుకుంటుందని పలువురు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. సినిమా అనేది ఆకాశంలాంటిదని అందువల్లే దశాబ్దాల క్రితం తెరకెక్కిన సినిమాలను కూడా నేటి తరం యువత ఆదరిస్తున్నారని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. సినిమా, వెబ్ సిరీస్ లలో ఏది పై చేయి సాధిస్తుందో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: