'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా పాకింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతటి ఘన కీర్తి సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన వారిలో విజనరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి మరియు విజువల్ క్రియేటర్ సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ ఉన్నారు. రాజమౌళి - సెంథిల్ బంధం ఈ నాటిది కాదు. 2004 వ సంవత్సరంలో ప్రారంభమైంది వీరి ప్రయాణం. వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు 'మగధీర' 'ఈగ' 'ఛత్రపతి' 'విక్రమార్కుడు' 'బాహుబలి - ది బిగినింగ్' 'బాహుబలి - ది కంక్లూషన్' వంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆర్.ఆర్.ఆర్' వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న 10వ సినిమా.

 

దర్శకధీరుడు రాజమౌళి రెండేళ్ల గ్యాప్ తీసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లతో 'రౌద్రం రణం రుధిరం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామ రాజు'గా కనిపిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంభందించిన పలు విషయాలను సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ మీడియాకి పంచుకున్నారు.

 

ఆయన మాట్లాడుతూ ''బాహుబలి 'ఆర్.ఆర్.ఆర్' రెండు సినిమాలు గర్వించదగ్గ సినిమాలు.. కానీ రెండు వేటికి అవి డిఫరెంట్. బాహుబలి కల్పిత కథ కాగా 'ఆర్.ఆర్.ఆర్' రియలిస్టిక్ పాత్రలతో చేస్తున్నట్టు ఊహాజనిత కథ. ఆ పాత్రల తీరు తెన్నులు ఎలా ఉంటాయో ప్రజలకు తెలుసు.. అలానే 'అల్లూరి' - 'కొమరం భీమ్' లు ఇండిపెండెన్స్ కి ముందు కాలంలో ఉంటారని కూడా తెలుసు. దీని వలన ఆ రోజుల్లో ఇండియా ఎలా ఉండేదో.. పరిస్థితులు ఎలా ఉండేవో కచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సినిమా నాకు ఛాలెంజింగ్ మూవీ అని చెప్పవచ్చు. దీనికి తగ్గట్టే ఈ సినిమా చిత్రీకరణ కొనసాగింది'' అని వెల్లడించారు. కాగా పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: