74 సంవత్సరాల వయసులో కూడ తన గొంతులో సప్తస్వరాలను పలికిస్తూ తన పాటలతో అందరికీ స్వరరాగ నాదామృతాన్ని పంచుతున్న ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గొంతు విన్న చాలామంది బాలు గత జన్మలో ఒక గంధర్వుడు అని అంటూ ఉంటారు. గంధర్వుడు భూమికి దిగివచ్చి పాడినట్లుగా అనిపించే ఆయన గొంతు 11 భాషల్లో 50 వేల పాటలు పాడి గిన్నీసు రికార్డును అందుకుంది. భక్తి విరహం విషాదం ప్రేమ మాస్ బీట్స్ సందేశం దేశభక్తి ఇలా ఏభావాన్ని అయినా బాలు తన గొంతులో పలికిస్తాడు. 

 

పదాల మాధుర్యం ఏమాత్రం దెబ్బ తినకుండా స్పష్టమైన ఉచ్చారణతో బాలు తన పాటలో చేసే పద ప్రయోగాలు నేటితరం గాయకులకు ఒక నిఘంటువుగా ఉపయోగపడతాయి. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటాడు బాలు. హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజె కెలియే’ సినిమాతో అద్భుతంగా పాడి జాతీయస్థాయిలో తనకంటూ ఏర్పరుచుకున్న గుర్తింపు ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. 

 

తెలుగు భాషతో పాటు హిందీ తమిళం కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది. ఘంటసాల జీవించి ఉండగానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలసుబ్రహ్మణ్యంకు ఆయన చనిపోయిన తరువాత మాత్రమే ఖ్యాతి లభించింది. ఘంటసాల అనారోగ్యంతో ఉన్నా అప్పటి టాప్ హీరోలు అంతా ఘంటసాల చేత పాడించుకునే వారు కాని బాలసుబ్రహ్మణ్యం వైపు పెద్దగా చూడలేదు. 

 

అయితే బాలు ఇంకా బాగా పాడగలిగిన శక్తి కొనసాగుతూ ఉండగానే బాలుకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గి సరిగ్గా తెలుగు పదాలను పలకడం రాని పరభాషా గాయకులచేత మన టాప్ యంగ్ హీరోలకు పాటలు పాడించడం ఒక ట్రెండ్ గా మారింది. ఇలాంటి పరిస్థితులలో జనం బాలసుబ్రహ్మణ్యంను మర్చిపోకుండా గత 14 సంవత్సరాలుగా ఈటివి లో కొనసాగుతున్న ‘పాడుతాతీయగా’ కార్యక్రమం లేకుంటే నేటితరం ఈపాటికి బాలుని మరిచిపోయి ఉండేవారు అని కొందరు అభిప్రాయపడతారు. కొన్నివందల మంది నూతన గాయనీగాయకులను తయారుచేసిన పాడుతాతీయగా బాలసుబ్రహ్మణ్యం జీవితంలో సువర్ణాధ్యాయం. 75 సంవత్సరాలు వయసు పూర్తి అయ్యేవరకు తాను పాడుతూనే ఉంటాను అని బాలు చెపుతున్న మాటలు ఈనాటి పుట్టినరోజున నిజం అయి మరికొన్ని సంవత్సరాలు ఈ గానగంధర్వుడు మరికొంతమంది గాయనీగాయకులను తయారు చేయాలని కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: