నిజంగా రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి ఇంత తేడా ఉంటుందా అని సినీ జీవులే ఆలోచిస్తున్నారు. వారు ఇపుడు గోళ్ళు గిల్లుకుంటున్నారు లాక్ డౌన్ టైం మొదట్లో అన్ని రకాల ఆటలు ఆడేశారు. ఇంట్లో వంటలు చేశారు. తోటపని చేశారు. ఇల్లు ఊడ్చారు.

 

ఇలా ఉచిత వినోదాన్ని పంచిపెడుతూ తాము కూడా టైం పాస్ చేసుకున్నారు. అయితే ఇపుడు మాత్రం వారికి అసలైన సినిమా కష్టాలు తెలిసివస్తున్నాయి. అందుకే ఏ సెలిబ్రిటీ కూడా చాలంజిలు విసరడంలేదు. ఎవరు రియల్ మ్యాన్ అంటూ సవాళ్ళు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడాలూ అసలు లేవు.

 

ఓవిధంగా ఇపుడు సినీ జీవులు బెంగగా ఉన్నారు. ఎందుకంటే అసలు బొమ్మ పడుతుందా, షూటింగులు జరుగుతాయా అన్న టెన్షన్ వారిది. సినిమా షూటింగులకు జూన్ లో  అనుమతి ఇద్దామని అన్ని రాష్ట్రాలూ అనుకున్నాయి. అయితే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చేశాక కరోనా మహమ్మారి  విశ్వరూపం చూపిస్తోంది.

 

ఒక పట్టాన అదుపులోకి రావడంలేదు సరికదా రోజుకు తొమ్మిది వేల దాకా పాజిటివ్  కేసుల  స్కోర్ పెరుగుతోంది. దీంతో ఇపుడు పాలకులు కూడా ఆలోచనలో పడ్డారు. సినిమా ధియేటర్లకు అనుమతి ఇచ్చేది జూలైలోనే ఆలోచిస్తామని  చావు కబురు చల్లగా చెప్పేశారు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్.

 

అంటే థియేటర్లు మరో నెల రోజుల వరకూ తెరచుకోవని పక్కా క్లారిటీగా  ఆయన చెప్పేశారన్నమాట.  ఇక సినిమా షూటింగుల విషయంలోనూ ఇదే విధానం అనుసరిస్తారని తెలుస్తోంది. ఓ సమాచారం ప్రకారం సెప్టెంబర్ వరకూ షూటింగులకు అనుమతులు ఉండవని అంటున్నారు. అంటే మరో నాలుగు నెలల పాటు  హీరోలకు సెలవు వచ్చిందన్న మాట.

 

ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన వెండి తెర వేలుపులు ఇదేం కరోనా, ఇదేం ఇబ్బంది, జీవితంలో ఇలాంటివి చూడలేదు అని వాపోతున్నారు. మొత్తానికి బొమ్మ పడేది ఎపుడు. ఇది పెద్ద ప్రశ్న. షూటింగు జరిగేది ఎప్పుడన్నా కూడా సమాధానం ఇప్పట్లో లేదుగా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: