కరోనా దెబ్బతో ఫిలిం ఇండస్ట్రీ ఆలోచనలు అన్నీ మారిపోతున్నాయి. అంతకు ముందు ఇండస్ట్రీలోని నిర్మాతలు అందరు టాప్ హీరోల సినిమాలు చేయడానికి మోజు పడితే అదేవిధంగా టాప్ హీరోల సినిమాలను కొనుక్కోవడానికి బయ్యర్లు మోజు పడేవారు. లేటెస్ట్ గా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం సినిమా ధియేటర్లు ఓపెన్ చేసినా ఆ సినిమాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య సుమారు 30 శాతం వరకు తగ్గుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలకు వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో టాప్ హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయా రావా అన్న విషయం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదల అయిన తరువాత ఆ సినిమాకు వచ్చే ఓపెనింగ్ కలక్షన్స్ ను బట్టి మిగతా టాప్ హీరోల భవిష్యత్ మూవీ బిజినెస్ ఆధారపడి ఉంటుంది అన్న ఒక లెక్క కడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే కొనసాగుతున్న ఈ లాక్ డౌన్ పిరియడ్ లో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒకసారి కొత్త ఆలోచనలకు బీజం పడింది.


తెలుస్తున్న సమాచారం మేరకు ఇండస్ట్రీకి సంబంధించిన అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు కొత్త నిర్మాతలు ఈ లాక్ డౌన్ పిరియడ్ లో 10 కోట్ల బడ్జెట్ లోపు పూర్తి చేయగల మంచి క్వాలిటీ చిన్న సినిమాల వైపు దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న చిన్న హీరోలు హీరోయిన్స్ పై ప్రముఖ నిర్మాణ సంస్థల దృష్టి పడింది అని టాక్.


నిర్మాణ విలువలలో ఏమాత్రం రాజీ పడకుండా మంచి ప్రతిభ ఉన్న కొత్త దర్శకులను ఎంపిక చేసి వారితో మంచి కథలు వ్రాయించి హై క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వగల సినిమాటోగ్రాఫర్ సంగీత దర్శకులు ఎడిటర్ లను ఎంపిక చేసి మొత్తం సినిమా ప్రాజెక్ట్ ను అంతా 10 కోట్లలోపు పూర్తి అయ్యే విధంగా డిజైన్ చేసే పనిలో ప్రస్తుతం భారీ నిర్మాణ సంస్థలు కూడ బిజీగా ఉన్నాయి అని టాక్. కరోనా పరిస్థితుల మధ్య ధియేటర్లు ఓపెన్ అయి కలక్షన్స్ తగ్గినా తమకు నష్టం రాకుండా అమలుచేయాలి అని అనుకుంటున్న ఈ కొత్త ఆలోచనలు విజయవంతం అయితే టాప్ యంగ్ హీరోలు మిడిల్ రేంజ్ హీరోలకు రానున్నది గడ్డు కాలం అంటూ ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: