రామ్ మందిర్ కేసు చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కే అపరాజిత అయోధ్య చిత్రానికి బాలీవుడ్ నటీమణి కంగనా రనౌత్ దర్శకత్వం వహించనున్నది. అయితే ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి కె.వీ విజయేంద్ర ప్రసాద్ కథను సమకూరుస్తున్నాడు. కంగనా రనౌత్సినిమా గురించి మాట్లాడుతూ... ' ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలని నేను అనుకోలేదు. ఈ చిత్రాన్ని ఒక ప్రాజెక్టు లాగా ప్రారంభించి కాన్సెప్ట్ లెవెల్ నుండి పని చేయడం ప్రారంభించాను. నేను ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాను, దర్శకత్వం వహించడానికి వేరొక వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి అనుకున్నాను. ఈ సినిమా దర్శకత్వం నేను చేయాలని అప్పట్లో ఆలోచించేందుకు కూడా నాకు సమయం లేదు. ఎందుకంటే అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను'


'కానీ ఎప్పుడైతే విజయేంద్ర ప్రసాద్ గారు నాకు స్క్రిప్టుని చాలా వివరంగా వినిపించారో... అప్పుడు నాకు ఈ చిత్రం నేను గతంలో డైరెక్ట్ చేసిన చారిత్రాత్మక విషయాలు లాగానే ఉందని అర్థం అయింది. దాంతో ఈ చిత్రాన్ని నేను డైరెక్ట్ చేస్తే అద్భుతంగా వస్తోందని నేను అనుకున్నాను. అందుకే ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు నేను సిద్ధమయ్యాను', అని ఆమె చెప్పుకొచ్చింది. కె.వి విజయేంద్ర ప్రసాద్ రాసిన స్క్రిప్ట్ తో మణికర్ణిక: ది క్వీన్ అఫ్ ఝాన్సీ సినిమాని తానే స్వయంగా డైరెక్ట్ చేయడంతో పాటు ప్రధాన పాత్రలో కంగనా రనౌత్ నటించింది. 


అపరాజిత అయోధ్య కంగనా రనౌత్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణంలో తెరకెక్కనున్నది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటించదని తెలుస్తుంది. ఎందుకు అని ప్రశ్నిస్తే తాను మాట్లాడుతూ... 'ఈ సినిమా ద్వారా పూర్తి డెడికేషన్ కలిగిన ఫిలిం మేకర్ గా నేను మారాలనుకుంటున్నాను. నా శ్రద్ధ మొత్తం దర్శకత్వం పైనే కేంద్రీకరిస్తాను. నాకు తెలిసినంత వరకు... ఈ చిత్రం వివాదాస్పద సబ్జెక్టు కాదని అనుకుంటున్నాను. అపరాజిత అయోధ్య ని... నేను ప్రేమ, నమ్మకం, ఐక్యమత్యం, ముఖ్యంగా దైవత్వం గురించి ప్రేక్షకులకు చూపించే ఒక మంచి చిత్రంగా భావిస్తున్నాను', అని ఆమె తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: