కరోనా తో తెలుగు చిత్ర పరిశ్రమ కుదేలయింది. చిన్న సినిమా నిర్మించే నిర్మాత దగ్గర్నుంచి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు నిర్మించాలనుకునే బడా నిర్మాతల వరకు ప్రతీ ఒక్కరు ఎంతో నమ్మకంతో కనీసం లాభాలొస్తాయని ధైర్యంగా సినిమాలు ప్లాన్ చేసుకునే వారు. కాని ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. కొంతమంది నిర్మాతలైతే ఎంత మాత్రం రిస్క్ చేయడానికి సాహసించడం లేదు. ఇక ఇప్పటికే మొదలై కొంత టాకీ పార్ట్ జరుపుకున్న సినిమాలని కిందా మీదా పడి పూర్తి చేయాలనుకుంటున్నారు. అయినా ఆ సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు.

 

అయితే ఈ విషయాలన్నిటిని ఆలోచించి ఆయనకున్న అనుభవంతో నిర్మాతల కష్టాలను దృష్ఠిలో పెట్టుకొని ఇటీవల అందరికి సలహాలు సూచనలు ఇస్తున్నారు మెగాస్టార్. 
ఇవి కేవలం బయట నిర్మాతలు దర్శకులకే కాదు తనయుడు రాం చరణ్ తో పాటు ప్రముఖ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కి కూడా చెబుతున్నారు. అదేమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోను కొంతకాలం భారీ బడ్జెట్ తో సినిమాలని నిర్మించ వద్దని. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో జనాలు మునపటి మాదిరిగా ధైర్యంగా థియోటర్స్ కి వస్తారో ఏమాత్రం ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ఇది ఆలోచించకుండా మొండి ధైర్యం తో గనక ముందడుగు వేసి భారి బడ్జెట్ తో సినిమాలని నిర్మిస్తే మాత్రం మనల్ని మనమే కాపాడుకోవడం కష్టమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

అయితే మెగాస్టార్ చెప్పిన దాంట్లో 100 కి 100 శాతం వాస్తవం ఉంది. అది గమనించాల్సిన.. ఆలోచించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిలోను ఉంది. అది ఇండస్ట్రీ మంచికే అని కూడా అందరు అర్థం చేసుకోవాలి. అయితే మెగాస్టార్ చెప్పిన ఈ సలహాలు గనక పాటిస్తే ఇప్పట్లో పాన్ ఇండియా సినిమాలు రావని అర్థమవుతుంది. ఇప్పటికే మొదలైన సినిమాలకి బడ్జెట్ తగ్గిస్తే బావుంటుందన్న చర్చలు జరుగుతున్నాయి. దానికి తోడు 2022 వరకు ఒక మోస్తారు సినిమాలు చేస్తూ ఆ తర్వాత మళ్ళీ పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటే మంచిదని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంతమంది జాగ్రత్త పడతారో చూడాలి.     

మరింత సమాచారం తెలుసుకోండి: