కరోనా మూలంగా సినిమా థియేటర్లు మూతబడిపోవడంతో జనాలు వినోదం కోసం ఓటీటీ వైపు మళ్ళారు. తెలుగు, తమిళం అని భాషాభేధం లేకుండా తమకి నచ్చిన సినిమాలని వెబ్ సిరీస్ లని చూస్తున్నారు. కరోనా రోజు రోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

 

 

 

అందులో భాగంగానే తెలుగులో మరో సినిమా ఓటీటీ ద్వారా రిలీజ్ కావడానికి సిద్ధం అవుతోంది. యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవనుంది. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మళయాల చిత్రమైన మహేషింటే ప్రతీకారం అనే చిత్రానికి అధికారిక రీమేక్. మళయాలంలో ఫాహద్ ఫాజిల్ లీడ్ రోల్ పోషించారు.

 

 

కేరాఫ్ కంచరపాలెం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన వెంకటేష్ మహా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బాహుబలి నిర్మాతలైన ఆర్కా మీడియా వర్క్స్ ఈ సినిమాని నిర్మించింది. ఇప్పటికే రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు నిజమయ్యే సమయం ఆసన్నమైందని అంటున్నారు.

 

 

 

మరికొద్ది రోజుల్లో నెట్ ఫ్లిక్స్ వేదికగా ఉమామహేశ్వర ఉగ్రరూపం చూడొచ్చని టాక్. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఇంకా బయటకి రాకపోయినప్పటికీ, కొద్దిరోజుల్లోనే వెల్లడి కానుందని చెబుతున్నారు. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న రెండవ తెలుగు సినిమా ఇదే అవుతుంది. మొదటి సినిమా అమృత రామమ్ కి అంతగా రెస్పాన్స్ రాలేదు. మరి ఈ సినిమా ఎలాంటి స్పందనని దక్కించుకుంటుందో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: