హీరోగా సక్సెస్ అవ్వాలంటే మాస్ సినిమా పడాల్సిందే. స్టార్ ఎదగాలంటే మాస్ ఆడియన్స్ ను మెప్పించాల్సిందే. కమర్షియల్‌ రికార్డ్‌లు తిరగరాయాలన్న హీరోగా తిరుగులేని ఫాంలోకి రావాలన్న మాస్ హీరో అనిపించుకోవాల్సిందే. ప్రజెంట్ నెంబర్‌ వన్‌ పోజీషన్‌లో ఉన్న స్టార్స్ అంతా అలా మాస్ సినిమాలతో అభిమానులను అలరించిన వారే.

 

అయితే వీరిలో మాస్ అన్న పదాన్నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు ఓ సీనియర్ హీరో. చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీకి పరిచయం అయి తరువాత మాస్ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన నటుడు రవితేజ. విలన్‌గా సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన రవితేజ, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన నీ కోసం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే క్లాస్‌ సినిమాతో హీరో అయినా మాస్ ఆడియన్స్‌కు ఆరాధ్య దైవంగా మారిపోయాడు.

 

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఇడియట్‌ సినిమా రవితేజను మాస్ ఆడియన్స్‌కు చేరువ చేసింది. ఈ సినిమాతో హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న రవితేజ తరువాత వరుసగా అదే తరహా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఖడ్గం, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, వెంకీ, భద్ర లాంటి సినిమాలు రవితేజ స్థాయిని పెంచాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమార్కుడు రవితేజను స్టార్ హీరోల సరసన నిలిపింది.

 

అంతేకాదు అప్పటి వరకు హీరోగా ఉన్న రవితేజను మాస్ మాహరాజ్‌ను చేసింది ఈ సినిమా తన కెరీర్‌లో 99 పర్సెంట్ మాస్ యాక్షన్‌ సినిమాలనే చేశాడు రవితేజ. అందుకే మాస్ ఆడియన్స్‌లో తిరుగులేని ఫాలోయింగ్ సాధించాడు. ఇక మిగతా హీరోలతో పోలిస్తే ఒకే తరహా సినిమాలు ఎక్కువగా చేయటంతో రవితేజ ఆడియన్స్‌ కు బోర్‌ కొట్టేశాడు. అందుకే ఇటీవల కాలంలో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: