ఎంఐ కిషన్ రాసిన హరిశ్చంద్రుడు అబద్ధమాడితే నవల ఆధారంగా తెరకెక్కిన 'ఏప్రిల్ 1 విడుదల' సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, శోభ హీరో హీరోయిన్లు గా నటించగా... జయలలిత, కృష్ణ భగవాన్, మల్లికార్జునరావు, వై. విజయ, రాళ్లపల్లి ప్రధాన పాత్రల్లో నటించారు. దివాకర్ అనే పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ భువనేశ్వరి(శోభ) అనే రైల్వే బుకింగ్ క్లర్క్ గా పనిచేసే ఓ యువతిని ఒక పెళ్లి లో చూసి మనసు పారేసుకుంటాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలనే తపనతో ఆ అమ్మాయి మామయ్యను కలిసి ఒప్పించమని వేడుకుంటాడు. దాంతో ఆ అమ్మాయి మామయ్య మాట్లాడుతూ... మీరు ఇల్లు, ఆస్తి సంపాదించుకొని రండి, భువనేశ్వరి ని ఒప్పిస్తానని చెప్తాడు. 


దాంతో ఈ అనాధ యువకుడైన దివాకరం తనని పెంచి పెద్ద చేసిన రైల్వే డాక్టర్ వసుంధర సహాయంతోను, తన తెలివితేటలు, అబద్దాలతోను, రౌడీ మిత్రుడు గోపి(కృష్ణ భగవాన్) సహాయంతోను తన సొంతంగా ఒక వీడియో షాపు పెడతాడు. అదే సమయంలో భువనేశ్వరి బదిలీ అయ్యి దివాకరం ఉంటున్న రాజమండ్రి ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది. అది తెలుసుకున్న దివాకరం నేరుగా తన ఇంటికి వెళ్లి నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను అని ధైర్యంగా తన మనసులోని మాటను వెళ్లగక్కుతాడు. అయితే అప్పటికే దివాకరం ఒక అబద్దాల పుట్ట అని తెలుసుకున్న భువనేశ్వరి ఒక నెల వరకు అనగా ఏప్రిల్ 1 వరకు ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధాలు చెప్పకుండా కేవలం నిజాలే చెప్పాలని షరతు పెడుతుంది. ఒక నెల పాటు అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెబితేనే తనను పెళ్లి చేసుకుంటానని బంపర్ ఆఫర్ ఇస్తుంది. 


ఈ షరతు కు ఒప్పుకున్న దివాకరన్ ఒక పేపర్ పై సంతకం కూడా చేస్తాడు. అనంతరం ఎప్పుడూ అబద్ధం ఆడే దివాకరం నిజాలు చెప్పడం ప్రారంభిస్తాడు. గతంలో ఆడిన అబద్ధాలన్ని తన నిజాలతో బట్టబయలు చేస్తూ తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. ఈ సన్నివేశాలను దర్శకుడు వంశీ అద్భుతంగా తీర్చిదిద్దాడు అని చెప్పుకోవచ్చు. మల్లికార్జున రావు, రాజేంద్రప్రసాద్ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. కళ్ళు చిదంబరం చెత్తకుప్పలో నుండి ఎత్తుకొచ్చిన టీవీ సెట్ ని మూర్తి(సాక్షి రంగారావు)కి 55 వేల రూపాయలకి అమ్మడం, భాగ్యం - చిన్నారావు లకు అక్రమ సంబంధం కుదిర్చేందుకు దివాకరం ఆడే అబద్ధాలు, ఆ తర్వాత చెప్పే నిజాలు కారణంగా చోటు చేసుకునే సంఘటనలు వెండితెరపై మ్యాజిక్ చేసి తెలుగు ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించాయి. 


సినిమా చిత్రీకరణ మొత్తం రాజమండ్రి రైల్వే కాలనీ లో జరిగింది. సినిమా చిత్రీకరణ కోసం ఎక్కడా కూడా ఒక్క సెట్ వేయకుండా కేవలం రైల్వే కాలనీ లో ఉన్న 50 ఇళ్లను ఎంపిక చేసుకొని సినిమా పూర్తి చేశాడు దర్శకుడు వంశీ. సినిమా అత్యంత సహజంగా రావడానికి గల కారణం నటీనటులు మేకప్ వేసుకోకపోవడమే అని చెప్పుకోవచ్చు. గోదావరి యాసతో మల్లికార్జున రావు రాజేంద్రప్రసాద్ చెప్పే డైలాగులు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: