కరోనా మహమ్మారి దేశాన్ని చుట్టేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్ని అతలాకుతలం అవుతుండగా మన దేశంలోనూ దీని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో అందరికీ చికిత్స అందించే పరిస్థితి కూడా లేదు. సాధారణ ప్రజలకు మాత్రమే కాదు. సెలబ్రిటీలకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి.

 

తాజాగా సీరియల్ యాక్ట్రెస్‌ చార్వీ సరాఫ్‌ తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నారు. `నాకు కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానంగా ఉంది. కానీ ఇక్కడ టెస్ట్ లు చేయించుకునే పరిస్దితి లేదు. గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది కలుగుతోంది` అంటూ టీవి సీరియల్ నటి  కసౌటీ జిందగీ కే ఫేం చార్వీ ఆవేదన వ్యక్తం చేసింది.

 

కోవిడ్ 19 లక్షణాలు కనిపించడంతో ఐదు రోజులుగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించిన సాధ్య పడటం లేదని చార్వీ వాపోయారు. సెలబ్రిటీ ఇమేజ్‌ ఉన్ననా పరిస్దితే ఇలా ఉంటే సామాన్యుల సంగతేంటని ఆమె ప్రశ్నించారు. తనకు ఎదురైన దుర్భర పరిస్థితులకు సంబంధించి ఓ లేఖను ఆమె విడుదల చేశారు.

 

ఆ లేఖలో `ఢిల్లీలో టెస్టు చేయించుకోవడం ఎంత కష్టంతో కూడుకున్న పనో తెలుసా? లాక్ డౌన్‌ విధించినప్పటి నుంచి నా సొంత ఊరు ఢిల్లీలోనే ఉన్నా. అందరిలాగే మా ఫ్యామిలీ కూడా ఇంటికే పరిమితమయ్యాం. నిత్యావసరాలకు తప్ప బయటకు వెళ్లడం లేదు. కరోనాతో కలిసి జీవించడానికి అలవాటు పడ్డాం. అయితే గతవారం రోజులుగా నాకు ఆరోగ్యం బాగుండటం లేదు, జ్వరం వచ్చింది.

 

అప్పటి నుంచి మా ఫ్యామిలీ డాక్టర్లు ప్రైవేటు డాక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రులకు ఫోన్ చేస్తూనే ఉన్నా. అందరిదీ ఒకేమాట.. తగినన్ని కిట్లు అందుబాటులో లేవు. ఆ మాటలు వినీ వినీ నాకు విసుగు వచ్చింది. రోజూ మీడియాలో వార్తలు ఏమో అనుకున్నా గానీ.. అవన్నీ నిజమే. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు` అంటూ లేఖలో తన అభిప్రాయాలను వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: