రవితేజ హీరోగా నటించిన షాక్ సినిమాతో దర్శకుడిగా మారి తనకు తానే షాక్ ఇచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. పవన్ అభిమాని అయిన హరీష్, అభిమానులకి కావాల్సిన విధంగా పవన్ కళ్యాణ్ చూపించి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. మాస్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన హరీష్ శంకర్ వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.

 

గద్దల కొండ గణేష్ తర్వాత పవన్ కళ్యాణ్ తో మూవీ తీస్తానని ప్రకటించిన హరీష్, ఆ సినిమా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాడు. ఈ పాటికే స్క్రిప్టు కూడా పూర్తయిందని సమాచారం. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. వకీల్ సాబ్ పూర్తి చేసుకుని, క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రాన్ని కంప్లీట్ చేసుకున్నాక కానీ పవన్ కళ్యాణ్ హరీష్ కి దొరకడు. అయితే ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయంలో హరీష్ శంకర్ ఒకానొక సినిమా తెరకెక్కిస్తాడట.

 

అయితే అది దర్శకుడిగా కాదు. నిర్మాతగా. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ బన్నీ వాసు, హరీష్ శంకర్ కలిసి కొత్త దర్శకుడు దీపక్ తో సినిమా నిర్మించాలని భావించారట. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. అన్నీ కుదిరితే మరికొద్ది రోజుల్లోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నిర్మాతగా బన్నీ వాసుకి అనుభవం చాలా ఎక్కువ. ఈ మధ్యనే ప్రతిరోజూ పండగే, గీత గోవిందం సినిమాలతో హిట్ అందుకున్నాడు.

 


అంత సక్సెస్ లో ఉన్న నిర్మాతతో చేయి కలుపుతున్నాడంటే కథ మీద, దర్శకుడి మీద బాగా నమ్మకం ఉన్నట్టుంది. ఆల్రెడీ హరీష్ శంకర్ సూపర్ విజన్ లో కథాచర్చలు జరిగాయట. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాపై అంచనాలు మరో రేంజ్ లో ఉంటాయి. దర్శకుడిగా సూపర్ సక్సెస్ అయిన హరీష్, నిర్మాతగానూ సక్సెస్ అవుతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: