2001 సెప్టెంబర్ 19 వ తేదీన విడుదలైన అధిపతి సినిమాలో మోహన్ బాబు, అక్కినేని నాగార్జున, ప్రీతి జింగానియా, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మలయాళ సినిమా అయిన నరసింహం(2000) కి రీమేక్ కాగా తెలుగులో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున సహాయనటుడిగా నటించాడు. మోహన్ బాబు యోగి అనే పాత్రలో నటించగా... నాగార్జున అతనికి స్నేహితుడిగా జగన్ అనే పాత్రలో నటించాడు. ఈ సినిమాలో యోగి తండ్రి ఐన పాండురంగారావు(విజయకుమార్) న్యాయవాది కాగా అతను ఒక పొలిటిషన్ ని అవినీతి కేసులో జైలుకు పంపిస్తాడు. ప్రతీకారంగా ఆ పొలిటీషియన్ యోగిని ఒక మర్డర్ కేసులో ఇరికించి తండ్రి చేతనే శిక్ష విధించేలా చేస్తాడు. ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు యోగి జైలు నుండి విడుదలవ్వగా... అదే రోజున ఆ పొలిటీషియన్ మరణిస్తాడు. 


దాంతో ఆ పొలిటీషియన్ కుమారుడైన దున్నపోతుల ధర్మారావు( ముకేశ్ రిషి) తన తండ్రి అస్తికలను గోదావరి నది లో కలపడానికి వెళ్లగా యోగి అతడిని అడ్డుకుంటాడు. అప్పుడు ధర్మారావు ఆగ్రహించి మీ తండ్రి అస్తికలు గోదావరిలో కలపక ముందుకే నా తండ్రి అస్తికలు కలుపుతాను అంటూ చాలెంజ్ విసురుతాడు. తదనంతరం యోగి అనురాధ( ప్రీతి జింగానియా) తో ప్రేమలో పడటం, తన తండ్రిపై మర్డర్ కేసు పడటం జగన్(నాగార్జున) ఈ మర్డర్ కేస్ పై విచారించడం చకచకా జరిగిపోతాయి. యోగి స్నేహితుడు జగన్ ఒక ప్రముఖ క్రిమినల్ లాయర్ కావడంతో తాను నిజమేంటో న్యాయస్థానంలో అలవోకగా నిరూపించి పాండురంగారావు నిర్దోషి అని తెలియజేస్తాడు. ఆ సమయంలోనే పాండురంగారావు... యోగి కూడా అమాయకుడని, అది తెలుసుకోలేక కొడుకుని నానా బాధలు పెట్టానని తెలుసుకుని కృంగిపోయి చివరికి మరణిస్తాడు. దీంతో దున్నపోతుల జనార్దన్ రావు, ధర్మారావు కారణంగానే తన కుటుంబం సర్వ నాశనమైందని కోపంతో వాళ్ళ పై యోగి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. ఈ క్రమంలో జగన్ యోగికి బాగా సహాయం చేస్తాడు. 


ఇకపోతే పగలు, ప్రతీకారాలు, బావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు చాలా సహజంగా నటించి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. అతని స్నేహితుడి పాత్రలో నటించిన అక్కినేని నాగార్జున సినిమా పూర్తయ్యే 20 నిమిషాల ముందు తెరంగేట్రం చేస్తాడు. ఆ తర్వాత ఒక డ్యూయెట్ సాంగ్, న్యాయస్థానంలో ఓ మంచి సన్నివేశం, క్లైమాక్స్ లో ఓ భీకరమైన ఫైట్ సన్నివేశంలో నాగార్జున కనిపిస్తాడు. సహాయ నటుడి పాత్రలో నటించిన నాగార్జున కు మంచి మార్కులే పడ్డాయి అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: