సినిమాలో ఎన్ని అలంకరణలు ఉన్నా హాస్యం లేకపోతే అదొక లోటుగానే అనిపిస్తుంది. తెలుగు సినిమాల్లో సున్నితమైన, అందమైన హస్యానికి చిరునామాగా నిలిచిన వ్యక్తి ‘జంధ్యాల’. తనదైన హాస్య చిత్రాల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం’.. ఇలా హాస్యం గురించి క్లుప్తంగా వివరణాత్మకంగా చెప్పారు. సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, రాళ్లపల్లి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి.. ఇలాంటి మేటి నటులంతా జంధ్యాల అనే బ్రహ్మ తీర్చిదిద్దిన బొమ్మలే. నేడు జంధ్యాల వర్ధంతి.

IHG

 

నేటి రోజుల్లో కామెడీ అంతే మాటలతో మ్యాజిక్ చేయడమే. కానీ.. జంధ్యాల సినిమాల్లో హాస్యం అంటే సందర్భం. అహనా పెళ్లంట సినిమాలో కోడి కూర తినాలనుకునే పిసినారి.. ఓ కోడిని వేలాడ దీసి వట్టి అన్నం తింటూ కోడి కూర తిన్నంత ఆనందం వ్యక్తం చేయడం ఓ సందర్భం. జంధ్యాల కాకుండా ఇటువంటి హాస్యం ఎవరు ఊహించగలరు. ఆనందం వచ్చినా.. బాధ వచ్చినా ‘బాబూ.. చిట్టీ’ అని పలవరించే అమాయకత్వపు మాటలు రాయడం ఎవరి తరం. అరగుండు పాత్ర ద్వారా బ్రహ్మానందాన్ని తెరపైకి తచ్చినా.. సుత్తిజంటతో కామెడీ చేయించినా అది జంధ్యాలకే చెల్లింది.

IHG

 

మానవా.. ఓ మానవా అని దేవకన్యతో చిలిపిగా పలికించినా.., శివుడ్ని.. ‘నువ్వు ఉన్నావనుకోవటం మా భ్రమ, నువ్వు లేవు..’ అంటూ కోపంగా అనిపించినా అవన్నీ జంధ్యాల కలం గొప్పదనమే. ఆకట్టుకునే సన్నివేశాలే జంధ్యాల బలం. హాస్యం, సెంటిమెంట్, కోపం.. సందర్భం ఏదైనా సరే అచ్చ తెలుగులో భావం వ్యక్తం చేయడం జంధ్యాల ప్రత్యేకత. వేటగాడు సినిమాలో సత్యనారాయణ-రావుగోపాల రావు మధ్య ప్రాసల డైలాగులతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. వ్యక్తిగా ‘జంధ్యాల’ మన మధ్య లేకపోయినా తెలగు ప్రేక్షకుల నవ్వుల్లో ఆయన జీవించే ఉంటారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: