తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కి వెళ్తుంటే తెలుగు నిర్మాతలేమో మళయాల చిత్రాలని రీమేక్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే నాలుగు మళయాల సినిమాలు తెలుగులో రీమేక్ కానున్నాయి. చిరంజీవి లూసిఫర్ సినిమాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ చిత్ర హక్కుల్ని కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఇంకా హెలెన్ అనే సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు పీవీపీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్లాన్ చేస్తుంది.

 

అయితే ఈ మూడింటితో పాటు గత కొన్ని రోజులుగా అత్యధికంగా చర్చల్లోకి వచ్చిన చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్. మళయాల నటులైన పృథ్వీ, బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మళయాలంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ డిసైడ్ అయ్యి రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఇద్దరు వ్యక్తుల ఇగోల వల్ల కలిగే పరిణామాలు ఎక్కడికి దారితీసాయన్న నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందట.

 

అయితే ఈ సినిమాల్లోని రెండు పాత్రలో ఎవరు చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. తాజాగా రానా, రవితేజ్జ ఈ రీమేక్ లో నటించడానికి సానుకూలంగా స్పందించారట. దాంతో డైరెక్టర్ ని వెతికే పనిలో పడ్డారు. మొదట్లో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా పేర్లు వినిపించాయి. కానీ వారెవ్వరూ ఫైనల్ అవ్వలేదు. తాజాగా ఈ రీమేక్ ని తెరకెక్కించడానికి దర్శకుడు దొరికేశాడని సమాచారం.

 

రాజేంద్ర ప్రసాద్ నటించిన అయ్యారే చిత్రానికి దర్శకత్వం వహించిన సాగర్ చంద్రని ఫిక్స్ చేసారట. సాగర్ చంద్ర శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు వంటి రియలిస్టిక్ సినిమాని హ్యాండిల్ చేసిన సాగర్ చంద్ర అయ్యప్పనుమ్ కోషియం చిత్రాన్ని బాగా తెరకెక్కించగలడని నమ్ముతున్నారట. మరి ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: