ప్రపంచ దేశాల్లో యువతరం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. కానీ.. యువత డ్రగ్స్ కు బానిసవడం కలవరపెట్టే అంశం. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ చాప కింద నీరులా సమాజంలోకి వచ్చేస్తోంది. టీనేజ్, కాలేజీ యువత టార్గెట్ గా కొందరు అక్రమార్కులు వేసే వలలో పడి డ్రగ్స్ కు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. నేడు ‘యాంటీ డ్రగ్ డే’ సందర్భంగా ఏపీ పోలీస్ శాఖ దీనిపై ఓ వెబినార్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి, నాని, సాయి ధరమ్ తేజ్ పాల్గొని విలువైన సందేశాలు ఇచ్చారు.

 

ఈ వెబినార్ లో పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టారు. సినిమా స్టార్లతో డ్రగ్స్ చూపించే చెడు ప్రభావాన్ని.. జీవితం విలువ ఎంతటిదో ఒక అవగాహన కల్పించారు. ‘మనిషి జీవితం ఎన్నో జన్మల పుణ్య ఫలం. జీవితం చాలా అందమైంది. క్షణికమైన ఆనందం కోసం నూరేళ్ల జీవితాన్ని ఫణంగా పెట్టడం మంచిది కాదు. కన్న తల్లిదండ్రుల గురంచి ఆలోచాంచాలి. రేపు మీ పిల్లలే ఇటువంటి ఉచ్చులో పడిపోతే తట్టుకోగలరా. మంచి జీవితాన్ని మనమే అందంగా మలచుకోవాలి’ అంటూ చిరంజీవి తన సందేశం వినిపించారు.

 

‘మనిషిని అధఃపాతాళంలోకి తొక్కేసేవి డ్రగ్స్. మీరు డ్రగ్స్ వైపు ఉంటారా.. పోలీసుల వైపు ఉంటారా. ఒక్క స్టెప్ అటు వేస్తే జీవితం నాశనమవుతుంది’ అని నాని అన్నారు. ‘డ్రగ్స్ జీవితాల్ని నాశనం చేసేస్తుంది. సమాజంలో డ్రగ్స్ స్ప్రెడ్ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదీ. ఈ పోరాటంలో పోలీసులకు అండగా నిలవాల్సిన అవసరముంది’ అని సాయిధరమ్ తేజ్ అన్నాడు. ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు, ఏపీ పోలీసులకు చిరంజీవి అభినందనలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: