1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా లో వెంకటేష్ సౌందర్య వినీత ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్ర బృందం సినిమా విడుదల కాకముందే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని భావించారట. కానీ ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచి వారందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ కి భార్యగా నటించిన సౌందర్య అత్యంత సహజంగా నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. వెండితెరపై చూస్తున్న వారికి నిజంగా తాను వెంకటేష్ భార్య ఏమో అనే ఫీలింగ్ కలిగిందంటే ఆమె నటనా చాతుర్యం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

 


వెంకటేష్ కు రెండో భార్యగా నటించిన వినీత కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. చీరకట్టు అందాలతో ముచ్చటైన హావభావాలతో నేపాలి అమ్మాయి మనీషా పాత్రలో నటించిన వినీత తెలుగు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచి పోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా తమిళ చిత్రం తైకులామే థైకులామే కి రీమేక్ కాగా... అక్కడ కూడా ఒరిజినల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

 


కథ గురించి తెలుసుకుంటే శ్రీరామ్( వెంకటేష్) సీత(సౌందర్య) ను పెళ్లి చేసుకుంటాడు కానీ వారికి మూడేళ్లు గడిచినా సంతానం కలగదు. దీంతో శ్రీరామ్ తండ్రి( కోట శ్రీనివాసరావు) తన కొడుకుని రెండవ పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. కానీ తాను మాత్రం రెండో పెళ్లి చేసుకొని తన భార్యని బాధ పెట్టాను అని శ్రీరామ్ తేల్చి చెప్తాడు. ఈ క్రమంలోనే సంతానం కలగకపోవడానికి  సీత లో లోపం ఉండటమే అని వైద్యుడు చెప్తాడు. శ్రీరామ్ ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా తనలోనే లోపం ఉందని చెబుతాడు. దీంతో సీత అతడికి పిల్లలు పుట్టించే శక్తి రావాలని ములక్కాయలు వండి పెడుతుంది. మరోవైపు శ్రీరామ్ తండ్రి ఈ విషయాన్ని ఊరంతా చెప్పి అతడి పరువు తీస్తాడు. అయినా కూడా శ్రీరామ్ తన భార్యలో లోపం ఉందని తెలిస్తే ఆమె ఎక్కడ తట్టుకోలేక పోతుంది అని ఈ అవమానాన్ని భరిస్తూ ఉంటాడు. 

 


ఈ క్రమంలోనే శ్రీరామ్ బిజినెస్ విషయాలపై నేపాలి వెళతాడు. ఆ ప్రాంతంలోనే శ్రీరామ్ కి మనీషా పరిచయమవుతుంది. అప్పుడే శ్రీరామ్ అసిస్టెంట్ గిరి (బ్రహ్మానందం) కొన్ని కారణాల వలన అబద్ధం చెప్పి శ్రీరామ్ కి మనీషా తో పెళ్లి చేస్తాడు. ఈ విషయం తెలిసిన తరువాత శ్రీరామ్ అతడిపై కోప్పడి... చివరికి మనీషా జీవితాన్ని నాశనం చేయకూడదని భావిస్తాడు. ఆమెను భారతదేశానికి తీసుకొచ్చి తన ఇంట్లో పనిమనిషిగా పరిచయం చేస్తాడు. అక్కడినుండి మనీషా, సౌందర్య, కోట శ్రీనివాసరావు, శ్రీరామ్ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు అందరినీ బాగా అలరిస్తాయి. చివరి సన్నివేశంలో సౌందర్య తన నటనా నైపుణ్యం చూపించి ప్రేక్షకుల మనసులను చూరగొన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: