కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో సినిమా నిర్మాతలు తీవ్ర నష్టాలని చవి చూస్తున్నారు. ఇప్పటికే థియేటర్లు మూతబడి వందరోజులు పూర్తయింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా మూసి ఉంటాయో తెలియని పరిస్థితి. కరోనా వైరస్ తన ప్రభావాన్ని రోజు రోజుకీ పెంచుకుంటూనే పోతుండడంతో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునేలా లేవు. ఒకవేళ తెరుచుకున్నా మునుపటిలా జనాలు థియేటర్లకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

 

అందువల్ల చిన్న సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయడమే మంచి పని అనుకుంటున్నారు. లాక్డౌన్ మొదట్లో ఓటీటీ వేదికగా రిలీజ్ అంటే తిరస్కరించిన వారు సైతం తమ సినిమాలని డిజిటల్ లో రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకి సరైన స్పందన రావడం లేదు. థియేటర్లలో ఆడవని అనుకున్న సినిమాలనే ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.

 

అయితే ప్రస్తుతం పరిస్థితి కొద్దిగా మారింది. మొన్నటికి మొన్న ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇతర చిత్రాల నిర్మాతలు తమ సినిమాలని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఒరేయ్ బుజ్జిగా చిత్రం ఓటీటీ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

మొదట్లో ఓటీటీలో విడుదలకి నిరాకరించినప్పటికీ, ప్రస్తుతం మరో అవకాశం లేకపోవడంతో డిజిటల్ లోకి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అందువల్లే ఎలాంటి సందర్భం లేకుండానే ఈ సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేసారని అంటున్నారు. మరి అధికారికంగా ఈ విషయాన్ని ఎప్పుడు వెల్లడి చేస్తారో చూడాలి. మాళవికా నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: