‌తమిళ‌నాడులోని తూత్తుకుడిలో తండ్రీకొడుకులు పోలీసు క‌స్ట‌డీలో చ‌నిపోయిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన విషయం తెలిసిందే.  కర్ఫ్యూ టైంలో షాపు ఓపెన్​ చేసి ఉంచారని తండ్రీ కొడుకులు జయరాజ్, బెనిక్స్ లను స్టేషన్ తీసుకెళ్లి చితక్కొట్టడంతో వారిద్దరూ ఆస్పత్రిపాలై చనిపోయారు.   తండ్రి, సోదరుడి డెడ్ బాడీలపై విపరీతమైన గాయాలున్నాయని, లాకప్​లో పోలీసులు వారిని టార్చర్ పెట్టారని జయరాజ్ కూతురు ఆరోపించారు. ఇద్దరి మరణాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకునే వరకు వారి డెడ్​బాడీలను కూడా అంగీకరించబోమని ఆందోళనకు దిగారు. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

 

తాజాగా ఈ ఘ‌ట‌న‌ను ర‌జ‌నీకాంత్ ‘క్రూర‌మైన హ‌త్య‌లు’గా ప‌రిగ‌ణించారు. నిబంధ‌న‌లకు విరుద్ధంగా కొంత‌మంది పోలీసులు పైశాచికంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై ర‌జ‌నీకాంత్ మండిప‌డ్డారు. ఇలాంటి త‌ప్పు చేసిన‌వారిని ఎట్టిప‌రిస్థితుల్లో వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని ర‌జ‌నీకాంత్ డిమాండ్ చేశారు. దేశంలో అసలే కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఇలాంటి సమయంలో ప్రజలకు రక్షణగా ఉంటూ ప్రజల బాగోగులు చూడాల్సింది పోయి.. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు. కొంత‌మంది పోలీసుల ప్ర‌వ‌ర్త‌న నాకు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.  తండ్రీకొడుకులు పోలీసు క‌స్ట‌డీలో చ‌నిపోయిన ఘ‌ట‌న ప‌ట్ల మంగ‌ళ‌వారం మ‌‌ద్రాస్ హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐ స్వీక‌రించే వ‌ర‌కు.. సీఐడికి అప్ప‌గించాల‌ని పేర్కొన్న‌ది. 

 

తిరున‌ల్‌వెళ్లికి చెందిన‌ సీబీ-సీఐడీ డీఎస్పీ అనిల్ కుమార్ .. ఈ కేసును విచారించాల‌ని కోర్టు ఆదేశించింది.  పోస్టుమార్ట‌మ్ నివేదిక‌, జుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ నివేదిక ఆధారంగా.. స‌త్తానుకులం పోలీసుల‌పై హ‌త్య అభియోగం న‌మోదు చేసేందుకు కావాల్సిన ఆధారాలు ఉన్న‌ట్లు ఇప్ప‌టికే మ‌ద్రాసు హైకోర్టు పేర్కొన్న‌ది. అయితే  ఐపీసీ 302 ప్ర‌కారం పోలీసుల‌పై కేసు నమోదు చేయ‌వ‌చ్చని కోర్టు తెలిపింది. అంతే కాదు  సీఐడీ విచార‌ణ జ‌ర‌గాల‌ని డివిజ‌న్ బెంచ్ స‌భ్యులైన జ‌స్టిస్ పీఎన్ ప్ర‌కాశ్‌, బీ పుగ‌లేందిలు తీర్పునిచ్చారు. కావాల‌నుకుంటే ఈ కేసుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం సీబీఐకి కూడా అప్ప‌గించ‌వ‌చ్చు అని కోర్టు పేర్కొన్న‌ది. 

మరింత సమాచారం తెలుసుకోండి: