ఎం.ఎం కీరవాణి.. ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అధ్బుతమైన, భావ ప్రదమైన పాటలను అందించి టాలీవుడ్ లో అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందిన సంగీత కెరటం ఎం.ఎం కీరవాణి. ఈయన మొదటి సినిమా రామోజీ రావు నిర్మించిన మనసు మమత అనే చిత్రం. తర్వాత అదే సంస్థలో పీపుల్స్ ఎన్ కౌంటర్, అమ్మ, అశ్విని తదిరత చిత్రాలకు పనిచేశాడు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం ఆయనకు మంచి బ్రేక్ నిచ్చింది.

 

ఇక ఆ త‌ర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన బోలెడన్ని సినిమాలకు కీరవాణినే ఎక్కువ‌గా స్వరకల్పన చేశారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రాఘవేంద్రరావు దర్శకత్వలో చేసిన ఘరానామొగుడు కీరవాణికి తిరుగులేని ఇమేజ్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వరుసగా ఆయన సంగీతాన్నందించిన సినిమాలన్నీ ఇటు మ్యూజికల్ గానూ అటు కమర్షియల్ గానూ సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్ బంపర్ హిట్ అయింది. అలాగే రాజమౌళి దర్శకుడిగా వచ్చిన అన్ని సినిమాలకు ఆయనే సంగీత దర్శకత్వం వహించాడు.

 

వీళ్లిద్దరికీ కీరవాణితో అంత బాగా సింక్ అయింది. ఇక ఆ గురు శిష్యులిద్దరి గురించి ఎప్పుడు మాట్లాడినా ఆసక్తికర విషయాలు చెబుతారు కీరవాణి. అయితే గ‌తంలో రాజమౌళికి.. రాఘవేంద్రరావుకు తేడా ఏంటీ అన్న‌ది కూడా కీరవాణి ఎంతో చ‌క్క‌గా చెప్పారు.  రాఘవేంద్రరావు ప్రయోగాలు చేయడానికి కొంచెం ఆలోచిస్తారని.. ఆయన దగ్గర కొత్తవాళ్లకు అంతగా ఛాన్స్ దొరకదని కీరవాణి చెప్పాడు. ఐతే రాజమౌళి అలా కాదని.. కొత్త ప్రయోగాలు చేయడానికి వెనుకాడడని అన్నాడు. రాఘవేంద్రరావు మొక్కని తన పెరట్లో పెంచుకుని దాన్ని మహావృక్షంగా మార్చడంలో నేర్పరి అయితే.. రాజమౌళి విత్తనం వేసి.. దాన్ని మొక్కగా పెంచగలడని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా మొక్క‌, వృక్షం గురించి ప‌క్క‌న పెడితే.. వాళ్ల ఇద్ద‌రి వ్యక్తిత్వాలు, దర్శకత్వ శైలి, సంగీతం విషయంలో అభిరుచి గురించి కీరవాణికి బాగా తెలుసు. అందుకే వాళ్లతో దశాబ్దాల పాటు ప్రయాణం సాగిస్తున్నాడు. 


 
  

మరింత సమాచారం తెలుసుకోండి: