నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో నిన్న ‘నాలో నాతో వైఎస్ ఆర్’ పుస్తక ఆవిష్కరణ కూడ జరిగింది. ఈ సందర్భంగా అనేకమంది ప్రముఖులు వైఎస్ఆర్ జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు చేసుకున్నారు.

 

అయితే కోన వెంకట్ నిన్న వైఎస్ఆర్ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ఇప్పుడు బయటపెట్టిన ఒక విషయం మాత్రం చాల ఆసక్తి దాయకంగా ఉంది. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండే రోజులలో ఒకసారి చెన్నై నుండి హైదరాబాద్ కు ఫ్లైట్ లో వస్తున్నప్పుడు అదే ఫ్లైట్ లో వైఎస్ఆర్ కూడ ప్రయాణించారట. దీనితో కోన వెంకట్ వైఎస్ఆర్ వద్దకు వెళ్లి నమస్కరించినప్పుడు ఆయన నవ్వుతూ ‘ఈమ‌ధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది. అంటే నీ కెరీర్ బాగుంద‌న్న‌మాట‌’ అని అన్నారట.


అంతేకాదు ‘నువ్వు మా ఇంటికి ఓసారి రావాలి. మా మేన‌ల్లుడు ఒక‌డున్నాడు. త‌న‌కు థియేట‌ర్లున్నాయి. సినిమాలు తీస్తానంటున్నాడు’ అనేస‌రికి కోన వెంకట్ కు ఆనందం పెరిగిపోయి తన కథల గురించి అడుగుతున్నారు కాబోలు అని వెంటనే జోష్ లోకి వెళ్ళిపోయాడట. అయితే అక్కడే వైఎస్ఆర్ కోన వెంకట్ కి ఒక ఊహించని ట్విస్ట్ అప్పట్లో ఇచ్చారు.


‘నువ్వు రావాలి వాడితో సినిమాలు తీయాల‌న్న ఆలోచ‌న మాన్పించాలి. నువ్వు కూడా ఓ సినిమా తీసి న‌ష్ట‌పోయావు క‌దా’ అని అనేస‌రికి. కోన వెంకట్ ఉత్సాహం ఒకేసారి నీరు కారిపోయిందట. గతంలో కోన వెంకట్ నిర్మాతగా ‘తోక లేని పిట్ట‌’ సినిమా తీసి విపరీతంగా నష్టపోయాడు. ఈ నష్టాలు తట్టుకోలేక అప్పట్లో కోన వెంకట్ అనేక ఒత్తిడిలకు లోనయ్యాడు. ఈ విషయాలు అప్పట్లో వైఎస్ఆర్ దృష్టికి ఎలా వెళ్ళాయో తెలియకపోయినా ఒక వ్యక్తితో ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలో తెలుసు కాబట్టే వైఎస్ఆర్ ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా సమర్థవంతమైన నాయకుడుగా తన జీవితాంతం ప్రజల మన్ననలను పొందగలిగారు..   

మరింత సమాచారం తెలుసుకోండి: