మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ రోజు తన 56వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతని సినీ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. మణిశర్మ ఇంటర్ సెకండియర్ వరకే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ సెకండియర్ పూర్తి చేయకుండానే మధ్యలో ఆపేసి తండ్రి లాగానే తను కూడా సినీ పరిశ్రమలో రంగప్రవేశం చేయాలనుకున్నారు. కొడుకు చదువు మానేశాడని తెలియగానే ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందిన నాగ యజ్ఞ శర్మ అతడిని సినిమా రంగంలో నైనా ఖచ్చితంగా పైకి తేవాలనే ఉద్దేశంతో ప్రముఖ దర్శకుల వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. తదనంతరం ఇళయరాజాకు, ఏఆర్ రెహమాన్ కు గురువైన జాకబ్ జాన్ వద్ద మణిశర్మ పాశ్చాత్య, కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత మణిశర్మ ని సినిమా స్టూడియోలకు తీసుకెళ్లి సంగీత దర్శకులకు పరిచయం చేశారు తండ్రి నాగ యజ్ఞ శర్మ.


విజయనగరం జిల్లా కొమరాడ గ్రామానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు చల్లపల్లి సత్యం దగ్గర హార్మోనిస్టుగా జాయిన్ అయ్యారు మణిశర్మ. ఇతని దగ్గర హార్మోనిస్టుగా చేరిన తర్వాత అతని పొడవాటి పేరు అయిన "యనమండ్ర వెంకట సుబ్రమణ్య శర్మ"... మణి శర్మ గా కుదించబడింది. ఆ తర్వాత కీబోర్డ్ లో పూర్తిస్థాయిలో మెళుకువలు అన్నీ తెలుసుకొని ఇళయరాజా వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. ఆ సమయంలో ఇళయరాజా నాగార్జున-వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన శివ సినిమాకి సంగీత దర్శకులుగా పని చేశారు. అయితే సరికొత్త సంగీత విద్వాంసుల కోసం ఇళయరాజా వద్దకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు రామ్ గోపాల్ వర్మ. అప్పుడే వర్మ మణిశర్మ ని గమనించాడు. తదనంతరం అతనికి తన తదుపరి సినిమా అయిన రాత్రి లో సంగీత దర్శకునిగా మణిశర్మ కి ఆఫర్ ఇచ్చారు. కానీ ఆ సినిమా హిందీ, తెలుగు భాషలో డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో మణి శర్మ కి సంగీత దర్శకుడిగా గుర్తింపు దక్కలేదు.


అలాగే రాత్రి సినిమా హారర్ కాబట్టి... హారర్ చిత్రాలలో సంగీతానికి అంత ప్రాధాన్యత ఉండదు కాబట్టి మణి శర్మ సంగీత దర్శకుడిగా పనిచేసిన తన మొట్టమొదటి రాత్రి సినిమాని పట్టించుకోకుండా రాజ్ కోటి వద్ద చేరి కీబోర్డు వాయించడం బాగా నేర్చుకున్నారు. కొద్దిరోజులకే మంచి కీబోర్డ్ ప్లేయర్ గా పేరు సంపాదించిన మణిశర్మ తెలుగు, తమిళ,  హిందీ సంగీత దర్శకుల నుంచి ఆఫర్లను సంపాదించారు. అలాగే ఒక్క కాల్ షీట్ కి పది నుంచి పన్నెండు వేల రూపాయల వరకు తీసుకునేవారట. అయితే మంచి కీబోర్డు ప్లేయర్ గా పేరు తెచ్చుకోవడంతో అతను లెక్కలేనన్ని అవకాశాలను చేజిక్కించుకొని రోజుకు రెండు కాల్ షీట్స్ లలో పాల్గొని 24 గంటల్లోనే 24 వేల వరకు సంపాదించేవారట.


నిజమేమిటంటే అప్పట్లో ఒక కీబోర్డు ప్లేయర్ కి రూ.10,000 ఇచ్చిన దాఖలాలు లేవట. దీంతో 10,000 కంటే ఎక్కువ వేతనాన్ని తీసుకున్న ఏకైక కీబోర్డ్ ప్లేయర్ గా మణిశర్మ రికార్డు సృష్టించారు. మంచి కీబోర్డ్ ప్లేయర్ గా కొనసాగుతున్న మణి శర్మ యొక్క టాలెంట్ ని గ్రహించిన అశ్వినీ దత్ చిరంజీవితో తాను తెరకెక్కించే చూడాలని ఉంది సినిమా లో సంగీత దర్శకుడిగా చేయాలంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. చిరంజీవి పేరు వినగానే మణిశర్మ గుండె ఒక్కసారిగా గుభేల్ అయ్యింది. నేనేంటి? అంతటి చిరంజీవి చిత్రానికి సంగీతం అందించడం ఏమిటి?  అని మణిశర్మ అశ్వినీదత్ ని అడగగానే... 'చూడు! మణిశర్మ నీ టాలెంట్ ని నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. చిరంజీవి సినిమాకి దర్శకత్వం వహించే గుణశేఖర్ కూడా మీ సంగీత సామర్థ్యాన్ని పరీక్షించారు. మా ఇద్దరికీ నిన్ను సంగీతదర్శకునిగా పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నీ మీద నమ్మకం ఉంది కాబట్టే మీకు ఈ ఆఫర్ ఇస్తున్నాము కాదనకండి', అని అశ్వినీ దత్ చెప్పారు.


దీంతో మణి శర్మ చూడాలని ఉంది కథను విని, పాటల లిరిక్స్ చదువుకొని ఆపై ట్యూన్ కంపోజ్ చేసి  క్యాసెట్ లో రికార్డు చేసి దానిని అశ్వినీదత్ కి ఇచ్చారు. ఈ క్యాసెట్ ని చిరంజీవికి ఇచ్చి ఏ.ఆర్.రెహమాన్ మన సినిమాకి సంగీతం సమకూర్చారు. ఒకసారి ఈ పాటలు విని ఎలా ఉన్నాయో చెప్పండి అని అశ్వినీ దత్ అడిగారు. దాంతో చిరంజీవి పాటలు విని 'వావ్ చాలా అద్భుతంగా, సరికొత్తగా ఈ పాటలను రూపొందించారు' అని కితాబు కూడా ఇచ్చారు. అది విన్న అశ్వినీదత్ చాలా సంతోషపడి 'ఇది ఏ.ఆర్.రెహమాన్ స్వరపరిచాడు అని అబద్దం ఆడాను. నిజానికి ఈ పాటలను మణిశర్మ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు', అని చెప్పేసాడు.


ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన చిరంజీవి ఎవరైతేనేం టాలెంట్ ఉన్న కొత్తవాళ్లని ప్రోత్సహిస్తే సినీ పరిశ్రమకు మేలు చేసినట్లు అవుతుందని మణి శర్మ ని తన సినిమాకి సంగీత దర్శకునిగా ఒప్పేసుకున్నాడు. అప్పటికే అతడికి సూపర్ హీరోస్ ప్రేమించుకుందాం రా వంటి సినిమాలో సంగీత దర్శకునిగా పని చేసే ఆఫర్లు వచ్చాయి. బాలకృష్ణ హీరోగా నటించిన సమరసింహారెడ్డి చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం వహించాలని ఆఫర్ వచ్చింది. వాటన్నిటికీ ఓకే చెప్పేసి మణిశర్మ ఎంతో శ్రద్ధగా సంగీతాన్ని సమకూర్చడం ప్రారంభించారు. ప్రేమించుకుందాం రా చిత్రంలో మూడు పాటలను స్వరపరిచిన మణిశర్మ కి మంచి గుర్తింపు వచ్చింది. మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా, ఓ పనైపోయింది, పెళ్లికళ వచ్చేసిందే బాలా  పాటలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకునిగా పనిచేసారు మణి శర్మ.



Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: