టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని శాసించే ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఒకరు అన్నది ఓపెన్ సీక్రెట్. నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా అనేక విజయాలు అందుకున్న అరవింద్ ఈమధ్యనే ‘ఆహా’ ఓటీటీ సంస్థను పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పట్లో ధియేటర్లు తెరుచుకునే పరిస్థితులు తిరిగి భారీ సినిమాలు హడావిడి చేసే వాతావరణం లేకపోవడంతో ప్రస్తుత వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనేక ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.


ఈ ప్రయత్నాలలో భాగంగా ‘ఆహా’ కూడ తన ఒరిజనల్ కంటెంట్ పెంచుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఆహా ఓటిటి సంస్థ నుంచి చాలా మంది టాప్ డైరక్టర్లకు ఆఫర్ల రూపంలో మొహమాటం ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల షూటింగ్ లు ఎలాగా లేవు కాబట్టి ఈ గ్యాప్ లో ఓ వెబ్ సిరీస్ కానీ చిన్న సినిమా కానీ ఏదో ఒకటి చేసి పెట్టమని టాప్ డైరక్టర్లు అందరినీ ఆహా తరఫున అరవింద్ అడుగుతున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి.


అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ షూటింగ్ లు లేకపోతే ఖాళీగా ఉన్నా ఫర్వాలేదు కాని వెబ్ సిరీస్ డైరెక్టర్స్ గా ముద్ర పడితే భవిష్యత్ లో తమకు టాప్ హీరోల సినిమాల అవకాశాలు రావు అన్న భయంలో ఉన్నట్లు టాక్. దీనితో అరవింద్ వ్యక్తిగతంగా కోరుతున్నా ఎదో రకరకాల కారణాలు చెప్పి అరవింద్ మొహమాటంలో పడకుండా తప్పించుకుంటున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.  


అయితే దర్శకుడు మారుతి మాత్రం అరవింద్ తో ఉన్న మొహమాటంతో ఇప్పుడు ‘ఆహా’ కోసం ఒక వెబ్ సిరీస్ తీసే ఆలోచనలలో బిజీగా ఉన్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా దిల్ రాజు కొంతమంది యంగ్ డైరక్టర్లను పిలిచి వెబ్ సిరీస్ లు చిన్న సినిమాలు నిర్మించే పని ప్రారంభించాడు అన్న వార్తలు కూడ వస్తున్నాయి. దీనితో దిల్ రాజ్ కూడ తన సొంత ఓటీటీ ఛానల్ పెట్టుకోబోతున్నాడా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: