సినిమా బాగుంటే కమర్షియల్, క్లాస్.. సినిమాల అర్ధాలు మారిపోతాయి. ఈ విషయాన్ని నిరూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆకోవలోకి వచ్చే సినిమానే ‘స్వర్ణకమలం’. కళాతపస్వి కె.విశ్వనాధ్ సృష్టించిన అద్భుతాల్లో ‘స్వర్ణకమలం’కు ప్రత్యేక స్థానం ఉంటుంది. సినిమా చూసినవారికి.. సినిమాలో అందెల సవ్వడి చూపించారా.. అందెల సవ్వడితోనే సినిమా తీశారా.. అనే అనుమానం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అంతటి కళ ఉన్న ఈ సినిమా విడుదలై నేటికి 32 ఏళ్లు పూర్తయ్యాయి. వెంకటేశ్ హీరోగా ఆయన కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ఈ సినిమా 1988 జూలై 15న విడుదలైంది.

IHG

‘కూచిపూడి నాట్యం’ ప్రధానాంశంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అనిర్వచనీయమైన అనుభూతికి గురి చేసింది. సినిమా చూసి నాట్యంపై మక్కువ పెంచుకున్నారు అప్పట్లో. నాట్యం అంటే ఇష్టం లేని అమ్మాయికి ఆ కళ గొప్పదనాన్ని.. తనకే తెలియని తనలోని కళను వెలికితీసే పాత్రలో వెంకటేశ్ సహజమైన నటన ప్రదర్శించాడు. నాట్యం అంటే ఇష్టం లేని అమ్మాయిగా భానుప్రియ చిలిపి నటన అద్భుతం అని చెప్పాలి. సినిమా ఆత్మకు తగ్గట్టు ఇళయరాజా అందించిన సంగీతానికి భానుప్రియ తన నాట్య ప్రావీణ్యంతో ప్రాణం పోసింది. సిరివెన్నెల సాహిత్యం పాటలకు ప్రధాన బలం.

IHG

కెఎస్. రామారావు స్పమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పై సీహెచ్ వి. అప్పారావు ఈ సినిమాను నిర్మించారు. సినిమా అద్భుత విజయం సాధించడమే కాకుండా ప్రభుత్వ పురస్కారాలు అందుకుంది. ఉత్తమ చిత్రంగా, భానుప్రియకు ఉత్తమ నటి, వెంకటేశ్ కు స్పెషల్ జ్యూరీ అవార్డులు దక్కాయి. వేదాంతం శేషేంద్ర శర్మ పాత్ర సినిమాలో నాట్యం చేస్తూ ప్రాణాలొదిస్తారు. నిజజీవితంలో కూడా అదే విధంగా నాట్యం చేస్తూ ఆయన మృతి చెందడం యాధృచ్చికం. ఇండియన్ పనోరమ విభాగంలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ప్రదర్శించారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: