పవన్ కళ్యాణ్ ,డైలాగ్స్, కాన్సెప్ట్ ,భజే భాజే పాట పవన్ కళ్యాణ్ ,డైలాగ్స్, కాన్సెప్ట్ ,భజే భాజే పాట సాగదీసిన సన్నివేశాలు, చెప్పాలనుకున్న విషయాన్నీ మధ్యలో వదిలేయడం , ప్రధాన పాత్రల మధ్య బంధం సరిగ్గా చూపించలేదు , ఎమోషనల్ అంశాలను సరిగ్గా చూపెట్టలేకపోవడం, దర్శకత్వం , ఎడిటింగ్ గోపాల రావు (వెంకటేష్) ఒక నాస్థికుడు , దేవుడి విగ్రహాల వ్యాపారం చేసుకునే గోపాల రావు భార్య మీనాక్షి(శ్రియ) కి దేవుళ్ళు అంటే అమితమయిన భక్తి తన భర్త మరియు కొడుకు బాగుండాలని కనిపించిన అందరి దేవుళ్ళకు మ్రోక్కడం అన్ని పూజలు చేయించడం ఆనవాయితీగా పెట్టుకుంటుంది. ఇవన్ని తనకి నచ్చకపోయినా భార్య మీద ఉన్న ప్రేమతో గోపాలరావు భరిస్తూ ఉంటాడు. ఒక రోజు నగరంలో సంభవించిన భూకంపం మూలంగా గోపాలరావు స్టోర్స్ కూలిపోతుంది. అతనికి భారీ మొత్తంలో నష్టం సంభవిస్తుంది. భీమ వారిని సంప్రదించగా ఇది దేవుడి వలన సంభవించిన ప్రమాదం (Act of God) దీనికి భీమా వర్తించదు అని చెప్తాడు. దీనంతటికీ కారణం గోపాలరావు దేవుడిని నమ్మకపోవడం వలెనే అని అందరు నిందిస్తారు. ఆ నిందల నుండే గోపాల రావు కి ఒక ఆలోచన పుడుతుంది అదేమిటంటే దేవుడి మీద న్యాయపరమయిన చర్యలు తీసుకోవడం. అందుకు ఏ న్యాయవాది సహకరించకపోవడంతో అక్బర్ ఖాన్(మురళి శర్మ) సహాయంతో దేశంలోని మతపెద్దలు అయిన లీలాధర్(మిథున్ చక్రవర్తి) , సిద్దేశ్వర్(పోసాని కృష్ణమురళి) లీగల్ నోటీసు లు జారి చేస్తాడు. న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా గోపాలరావు మీద మతవాదులు దాడి చేస్తారు. కురుక్షేత్ర యుద్దంలో అర్జునుడి ముందుండి నడిపించిన శ్రీ కృష్ణుడు అలియాస్ వాసుదేవ్(పవన్ కళ్యాణ్) గోపాలరావు కి అండగా నిలబడతాడు. ఆ తరువాత ఎం జరిగింది? అసలు గోపాలరావు కేసు గెలిచాడా లేదా? అన్నదే మిగిలిన కథాంశం ..వెంకటేష్ నాస్థికుడి పాత్రలో చాలా బాగా నటించారు ఆ పాత్రకి ఏదయితే కావాలో అది చాలా నిజాయితీగా అందించారు. ఇటువంటి పాత్ర చెయ్యడానికి నిజానికి చాలా ధైర్యం కావాలి ఈ విషయంలో ఈ నటుడిని కచ్చితంగా మెచ్చుకొని తీరాలి.. పవన్ కళ్యాణ్ , కెరీర్ లో ఉచ్ఛ స్థాయిలో ఉన్న ఈ నటుడు ఒక సహాయ నటుడి పాత్రను పోషించడం నిజంగా గొప్ప విషయం అంతే కాకుండా భారత దేశంలో ఎక్కువగా ఆరాదించే శ్రీ కృష్ణుడి పాత్రను పోషించడం ఇంకా ధైర్యంతో కూడుకున్న విషయం. శ్రీ కృష్ణుడి పాత్ర అనగానే నిర్మలమయిన నవ్వు మాయలతో కూడిన మాటలు ఇవే ప్రధానాంశాలు ఈ రెండింటికి కాస్త స్టైల్ ని కలిపి పవన్ కళ్యాణ్ తెర మీద చూపించిన విధానం చాలా బాగుంది ఈ చిత్రానికి ప్రధాన హైలెట్ పవన్ కళ్యాణ్ అని నిస్సందేహంగా చెప్పేసుకోవచ్చు.. శ్రియ పాత్ర కి కీలక సన్నివేశాలు ఏవీ లేకపోయినా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం ఉన్నాయి ఆ సన్నివేశాల వరకు ఈ నటి ఆకట్టుకుంది. మిథున్ చక్రవర్తి నటన హిందీలో లానే ఉన్నా ఈ చిత్రంలో ఈ నటుడి పాత్రకి కొన్ని అదనపు అంశాలను జతపరిచారు వాటిని కూడా కలిపి పాత్రను రక్తి కట్టించారు ఈ నటుడు.. పోసాని కృష్ణ మురళి కొన్ని సన్నివేశాలలో నవ్వించారు. దీక్ష పంత్ పాత్ర చాలా చిన్నది సరిగ్గా ఉపయోగించుకోలేదు. కృష్ణుడు , మురళి శర్మ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ తనయుడు అర్జున్ నటించడం విశేషం ..హిందీ చిత్ర రీమేక్ కాబట్టి కథలో లోపాలేం చెప్పలేము కాని కథని స్థానిక అంశాలకు తగ్గట్టుగా రాసుకునే ప్రయత్నంలో కథనం దగ్గర వచ్చింది సమస్య, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చెప్పాలి అన్న దర్శకుడి ప్రయత్నం మంచిదే కాని కొన్ని చోట్ల అదే సమస్య అయ్యి కూర్చుంది ఎందుకంటే ఒక్క సన్నివేశంతో అర్ధం అయ్యే సన్నివేశానికి మూడు అదనపు సన్నివేశాలను జత చెయ్యడంతో చిత్రం బాగా సాగినట్టు అనిపిస్తుంది అంతే కాకుండా పాత్రలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. పవన్ కళ్యాణ్ ని అయితే చాలా బాగా చూపించారు. పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్ మధ్య బంధాన్ని మరియు వెంకటేష్ శ్రియాల మధ్య బంధాన్ని పూర్తిగా చూపించలేకపోయారు.. హిందీలో పరేష్ రావల్ పాత్ర సమాజంతో పాటు కుటుంబానికి కూడా హీరో అవుతుంది, ఇక్కడ సమాజానికి మాత్రమే హీరో అయ్యి అక్కడే పరిమితం అయ్యింది. శ్రియ మరియు వెంకటేష్ ల మధ్య బంధాని మరియు వెంకటేష్ - వెంకటేష్ కొడుకు మధ్య బంధాన్ని సరయిన రీతిలో తెరకెక్కించి ఉంటె ఈ సమస్య వచ్చేది కాదు.

ఇక రెండవ అర్ధ భాగంలో చాలా సన్నివేశాలు సాగుతాయి, కొన్ని అనవసరమయిన సన్నివేశాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా చిత్రాన్ని ముగించేయవలసిన సమయంలో అనవసరమయిన హీరోయిజం సన్నివేశాలను జతపరిచారు, అవి కాస్త బెడిసి కొట్టాయి.. ఇక పోతే మాటల విషయానికి వస్తే సాయి మాధవ్ బుర్ర అందించిన సంభాషణలు చాలా బాగున్నాయి ఇటువంటి సున్నితమయిన అంశాల గురించి రాసుకునే మాటలు నిజాలు ఉండాలి కాని నిద్రలేపేలా ఉండాలి, ఈ విషయంలో అయన పనితీరు అద్భుతం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్ర చేత చెప్పించిన ప్రతి డైలాగ్ అద్భుతంగా కుదిరాయి.. వెంకటేష్ చేత చెప్పించిన " మనిషి దేవుడిని రాయిగా మార్చాడు , నిజంగా దేవుడే కనుక ఉంటె మనిషిని మనిషిగా మార్చమనండి చాలు" లాంటి ఆలోచన రేకెత్తించే సంభాషణలు చాలానే ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం గురించి పవన్ కళ్యాణ్ చేత చెప్పించిన డైలాగు చాలా బాగుంది. దర్శకత్వ విషయంలో కిషోర్ కుమార్ పార్థసాని ఒక్కసారిగా ఇద్దరు పెద్ద తారలను హేండిల్ చెయ్యవలసి వచ్చింది కాని సమస్య వారిద్దరితో రాలేదు వారి పాత్రలతో వచ్చింది ఒక పాత్ర ని ఇంకొక పాత్ర డామినేట్ చెయ్యకుండా చూసుకోవాలి ఈ తాపత్రయంలో పాత్రకి ఉన్న మూలాలను కాస్త జరిపెసాడు దాంతో పాత్ర సమతుల్యత దెబ్బతినింది.

ముఖ్యంగా వెంకటేష్ పాత్ర కాని కొన్ని అదనపు సన్నివేశాలు మాత్రం బాగా కుదిరాయి ఈ విషయంలో మరియు మాటల రచయిత నుండి మాటలను రాబట్టుకున్న విషయంలో దర్శకుడిని మెచ్చుకొని తీరాల్సిందే కాని కథనం దగ్గర ఇంకాస్త శ్రద్ధ వహించాల్సింది. శ్రీకృష్ణుడు గోపాలరావు ని కాపాడటానికి వచ్చినట్టు చాలా సన్నివేశాలలో అనిపించదు పవన్ కళ్యాణ్ వెంకటేష్ ని కాపాడటానికి వచ్చినట్టు అనిపిస్తుంది. పాత్రలను బలంగా చూపించాలా? హీరోలను ఎలివేట్ చెయ్యాలా? అన్న తడబాటు రెండవ అర్ధ భాగంలో చాలా సార్లు కనిపిస్తుంది. జయనన్ విన్సెంట్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది "భజే భాజే" పాట చూడటానికి తెర మీద అద్భుతంగా ఉంది. సన్నివేశాలను కూడా అందంగా చిత్రీకరించారు. అనుప్ రూబెన్స్ అందించిన సంగీతం మరియు నేపధ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా ఉన్నాయి చిత్రానికి తోడ్పడ్డాయి.. బ్రహ్మ కడలి అందించిన ఆర్ట్ వర్క్ బాగుంది.. గౌతం రాజు గారు అందించిన ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది సన్నివేశాల పొడవు విషయంలో చాలా సన్నివేశాలను క్షమించి వదిలేసారు.. పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ మరింత జాగ్రత్తగా చేసి ఉండాల్సింది కాస్త నాసిరకంగా కనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.మనిషి అనేవాడు కనిపించే మనిషికి ఇవ్వని విలువ కనిపించని దేవుడిని నమ్ముతుంటారు జనం, మరొకరికి సహాయం చెయ్యడమే దైవ కార్యం అది వదిలి దేవుడికి సేవ చెయ్యడం మీదనే దృష్టి పెట్టారు ఈ అంశం మీదనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పోషక విలువల లోపం తో సతమతం అవుతున్న పిల్లలకి ఇవ్వాల్సిన పాలని శివుడు పై పోసి వృధా చేస్తున్నారు. అలా చెయ్యకండి ఆ దేవుడు అయినా కోరుకునేది పరులకి సాయం చెయ్యమనే అన్న అంశాన్ని చెప్పారు. ఇప్పటికే ఓ మై గాడ్ మరియు పీకే లాంటి చిత్రాలు కూడా ఇదే కోవలోకి చెందాయి వీటిని ఆధ్యాత్మిక దృక్పధంతో కాకుండా సామాజిక దృక్పధంతో చూస్తే చిత్రంలో చెప్పాలనుకున్న అంశం మీకు అర్ధం అవుతుంది.ఒక నాస్థికుడి ప్రశ్నకి ఒక దేవుడి సమాధానం ఈ చిత్రం. హిందీ లో గనుక మీరు "ఓ మై గాడ్" చిత్రాన్ని చూడకపోయి ఉంటె లేదా మీరు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయితే ఇది తప్పక చూడవలసిన చిత్రం ...Pawan Kalyan,Venkatesh,Shriya Saran,Kishore Kumar Pardasany,D.Suresh Babu,Anoop Rubens.గోపాల గోపాల - నాస్థికుడి ప్రశ్న - దేవుడి సమాధానం

మరింత సమాచారం తెలుసుకోండి: