సినిమాటోగ్రఫీ , సంగీతం , టేకింగ్ , ప్రధాన పాత్రల నటనసినిమాటోగ్రఫీ , సంగీతం , టేకింగ్ , ప్రధాన పాత్రల నటనకథనంలో సాగదీత , ఫ్లాట్ నేరేషన్ , రెండవ అర్ధభాగం , కామెడీ తక్కువగా ఉండటం , థ్రిల్లింగ్ అంశాలేవి కనబడకపోవడం , ఎడిటింగ్

చందు(నాగ చైతన్య) మోసం చేస్తూ డబ్బులు సంపాదించి తన చెల్లెలు లలిత ను మెడిసిన్ చదివిస్తూ ఉంటాడు. "మంచితనం మాట్లాడటానికి పనికి వస్తుంది కాని బతకడానికి కాదు" అన్ని దృడంగా నమ్ముతాడు చందు, దీనికి తన తండ్రి సీతారామ్ (రావు రమేష్) కి జరిగిన అన్యాయం కారణం.ఇలా మోసం చేస్తూ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ రిచర్డ్(రవిబాబు)కి కమిషన్ ఇస్తూ మేనేజ్ చేస్తుంటాడు. ఇలా ఉండే చందుకి మీరా(కృతి సనన్) పరిచయం అవుతుంది మీరా ను చూడగానే ప్రేమలో పడిపోతాడు చందు. ఇదిలా నడుస్తుండగా నగరంలో ఒక బ్యాంకు దోచుకుంటారు మాణిక్యం(పోసాని) మనుషులు. జైలు లో ఉన్న సీతారాం ని ఎలాగయినా బయటకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలలో అనుకోని పరిస్థితుల్లో బ్యాంకు లో పోయిన డబ్బులు చందుకి దొరుకుతుంది. అది తెలిసిన మాణిక్యం, సీతారాం మరియు లలితను కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకురమ్మని బెదిరిస్తాడు. దాంతో డబ్బులు తీసుకురడానికి చందు చేస్తున్న ప్రయత్నాలకు రిచర్డ్(రవిబాబు) అడ్డు పడుతూ ఉంటాడు. హీరో  బులెట్ బాబు(బ్రహ్మానందం) ని ఉపయోగించుకొని వీటన్నింటి నుండి ఎలా బయటపడ్డాడు అన్నదే మిగిలిన కథ ... 

నాగచైతన్య నటన ఎప్పటిలానే ఉంది, ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశాలేవి కనబడలేదు కాని ఈ చిత్రంలో చైతన్య గత చిత్రాల కన్నా చాలా స్టైలిష్ గా కనిపించారు. ఈ పాత్రకి సరిపడా ఘాడత తన నటనలో చూపించలేకపోయారు. కృతి సనన్ కాస్త విభిన్నమయిన పాత్రలో కనిపించడమే కాకుండా అందం మరియు అభినయం రెండింటిని సమపాళ్ళలో అందించి ఆకట్టుకుంది. పోసాని పాత్రను ఇంకాస్త విభిన్నంగా తీర్చిదిద్ది ఉంటె బాగుండేది ఉన్నంతలో పోసాని తన విభిన్నమయిన నటనతో అలరించారు. రవిబాబు ఉన్నంతసేపు తన శైలిలో ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం పాత్రా మరియు అయన నటన ఆకట్టుకునే స్థాయిలో లేదు. రావు రమేష్, సన , వైవ హర్ష పలువురు నటులు వారి పాత్రల స్థాయి మేరకు నటించి ఆకట్టుకున్నారు. 

సుదీర్ వర్మ ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం మరియు అందించారు, నాకు ఉపయోగపడుతుంది అనిపిస్తే నేను ఏ చిత్రం నుండి అయినా ఏ సన్నివేశాన్ని అయినా కాపీ కొడతాను అని పబ్లిక్ గానే చెప్పిన ఈ దర్శకుడు ఈ చిత్రాన్ని పలు చిత్రాలను చూసి ప్రేరణ పొంది తెరకెక్కించారు. అందులో కొన్ని చిత్రాల పేర్లను చెప్పుకుంటే నౌ దో గ్యారా (లఘు చిత్రం), రన్ రాజా రన్, రాజా నట్వర్ లాల్ , ఏక్ ఖిలాడి ఏక హసీనా, లవ్ యాక్చువల్లి వంటి చిత్రాల పేర్లు చెప్పుకోవచ్చు. కథనం విషయంలో దర్శకుడు కాస్త వేగం గురించి గమనించి ఉంటె బాగుండేది చిత్రం చాలా ఫ్లాట్ గా సాగుతుంది థ్రిల్ చేసే అంశాలు ఒక్కటి కూడా కనిపించదు. టేకింగ్ విషయంలో మాత్రం తెలుగులో అద్భుతమయిన టేకింగ్ చెయ్యగల సత్తా ఉన్న దర్శకుల్లో ఒకడిగా మిగిలిపోతాడు సుధీర్, అంతలా బాగుంది టేకింగ్ మరియు ఫ్రేమింగ్ , మాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు బలమయిన డైలాగ్స్ కొన్ని ఉండి  ఉంటె ప్రేక్షకుడి మీద చిత్రం ప్రభావం కాస్త దృడంగా ఉండేది. ఈ చిత్రంలో టాప్ నాచ్ లో కనిపించే సాంకేతిక విభాగం సినిమాటోగ్రఫీ , రిచర్డ్ ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అద్భుతం అని చెప్పుకోవాలి. కొన్ని లోపాలు ఉన్నా కూడా ఈ చిత్రానికి ప్రధానంగా చెప్పుకోదగ్గ పాజిటివ్  సినిమాటోగ్రఫీనే , దీని తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకుంది మాత్రం సంగీతం, ఎం. ఆర్. సన్నీ అందించిన సంగీతం వినడానికే కాకుండా చిత్రీకరణ కూడా బాగుండటంతో పాటలు ఆకట్టుకున్నాయి, నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. కార్తిక శ్రీనివాస్ అందించిన ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పి గా ఉండాల్సింది, చిత్రంలో చాలా చోట్ల సన్నివేశాలను సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎస్విసిసి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చిత్రంలో ఫ్రేం చాలా రిచ్ గా కనిపిస్తుంది.

కథలో బలం, కథనంలో వేగం లేనప్పుడు టేకింగ్ మరియు ఫ్రేమింగ్ ఎలా ఉన్న ప్రేక్షకుడు చిత్రానికి కనెక్ట్ కాలేడు. దీనికి ఉదాహరణలు స్వామి రారా మరియు దోచేయ్ చిత్రాలు..  స్వామి రారా చిత్రంలో బలమయిన కథ కి వేగమయిన కథనానికి అద్భుతమయిన టేకింగ్ తోడయ్యి చిత్రాన్ని గెలిపించాయి. అదే దోచేయ్ చిత్రం విషయానికి వస్తే అద్భుతమయిన టేకింగ్ మాత్రమే మిగిలి కథలో బలం, కథనంలో వేగం కనుమరుగయిపోయింది. ఒకానొక సన్నివేశం దగ్గర తరువాత ఎం జరుగుతుందో పూర్తిగా తెలిసిపోతుంది, ఆసక్తికరమయిన కథనంతో సాగుంటే ఇది కూడా మంచి చిత్రమే అయ్యేది, కాని ఒక సాదాసీదా చిత్రం గా మిగిలిపోయింది. ఒక చిత్రం బాగుంటే బాగుంది అని గట్టిగా చెప్పవచ్చు, బాలేకపోతే బాలేదని ఇంకా గట్టిగా చెప్పచ్చు కాని ఈ చిత్రం మధ్యలో ఇరుక్కుపోయిన చిత్రం..  బాగుండాల్సిన చిత్రం బాగాలేకుండా పోయినట్టు , అసలు బాగాలేని చిత్రం బాగుండాలని ప్రయత్నించినట్టు ఉంది. చైతన్య లేదా కృతి అభిమాని అయితే ఈ చిత్రం చూడటానికి ప్రయత్నించవచ్చు , స్వామి రారా అభిమాని అయితే ఆలోచించుకొని వెళ్ళండి .. 

Naga Chaitanya,Kriti Sanon,Sudheer Varma,B.V.S.N Prasad,Sunny M.R.దోచేయ్ - స్కిప్ చేయ్ ..

మరింత సమాచారం తెలుసుకోండి: