బాలచందర్ మరియు కమల్ హసన్ , కొన్ని అద్భుతమయిన సన్నివేశాలు , నేపధ్య సంగీతం , సినిమాటోగ్రఫీ బాలచందర్ మరియు కమల్ హసన్ , కొన్ని అద్భుతమయిన సన్నివేశాలు , నేపధ్య సంగీతం , సినిమాటోగ్రఫీ స్క్రీన్ ప్లే , నేరేషన్ , ఎడిటింగ్ , దర్శకత్వం , ఉత్తముడి సన్నివేశాలు

మనోరంజన్ (కమల్ హసన్) తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ హీరో, అతను ఆ స్థాయికి ఎదగడానికి  కారణం మార్గదర్శి(కె. బాలచందర్), వరుసగా ఐదు చిత్రాలు ఇద్దరు కలిసి చేసి హిట్ కొట్టి ఉంటారు కాని మనోరంజన్ స్టార్ అవ్వడానికి అతనికి పూర్ణ చంద్ర రావు(కె. విశ్వనాథ్) తోడ్పడటమే కాకుండా తన కూతురు వర లక్ష్మి(ఊర్వశి) ని ఇచ్చి పెళ్లి కూడా చేస్తాడు. ఇదిలా ఉండగా మనోరంజన్ కి అప్పుడప్పుడు విపరీతమయిన తలనొప్పి వస్తుంటుంది అతనికి వైద్యం చేసే డాక్టర్ అపర్ణ(ఆండ్రియా)తో అతనికి అనుబంధం ఏర్పడుతుంది. జాకబ్ జకారియా(జయరాం) అనుకోని పరిస్థితిలో మనోరంజన్ జీవితంలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో మనోరంజన్ కి మెదడులో కాన్సర్ ఉన్నట్టు బయటపడుతుంది. మరి కొద్ది రోజుల్లో చనిపోబోయే అతను మార్గదర్శి వద్దకు వెళ్లి తన ఆఖరి చిత్రాన్ని తెరకేక్కించమని కోరుతాడు. ప్రేక్షకులు సంతోషంగా బయటకి వచ్చేలా ఆ చిత్రం ఉండాలని అడుగుతాడు. అలా మొదలయ్యేదే "ఉత్తమ విలన్". ఆ తరువాత ఏమి జరిగింది? కథలో యామిని మరియు మనోన్మణి ఎవరు? అన్నది తెర మీద చూడాల్సిన విషయాలు... 

కమల్ హసన్ ఈ చిత్రంలో మూడు షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు , అభిమానులకు నచ్చే హీరోగా ఒకటి , వ్యాధితో బాధపడే వ్యక్తిగా ఒక్కటి , ఉత్తముడి పాత్ర మరొకటి .. దేనికి అదే అద్భుతం .. ప్రతి పాత్రకి కావలసినంత తేడా చూపించారు కమల్ హసన్. అద్భుతమయిన నటన కనబరిచారు అని చెప్పడం ఆనవాయితే అయినా అంతకు మించి మరొక పదం దొరకడం లేదు.. కె బాలచందర్ గారి సన్నివేశాలన్నీ అయన జ్ఞాపకాలు , అయన నటన అందరికి పాఠాలు, ఈ వయస్సులో కూడా ఈ స్థాయి నటన కనబరచడం ఆయనకే సాధ్యం. కె విశ్వనాథ్ గారి గురించి అయినా ఇంతకు మించి ఏమి చెప్పగలం పాత్రకు ప్రాణం పోశారని తప్ప .. ఆండ్రియా పాత్ర చాలా చిక్కులు ఉన్న పాత్ర , ఆ స్థాయిలోనే తన శైలి నటన కనబరిచి ఆకట్టుకుంది ఆండ్రియా. పూజ కుమార్ ఆమె పాత్రకు తగ్గ ప్రదర్శన ఇచ్చింది బోనస్ లా అందాలతో ఆకట్టుకుంది.. భాస్కర్ పోషించిన పాత్ర చాలా బాగుంది. కొన్ని కీలక సన్నివేశాలలో ఈ పాత్ర నటన చాలా ఆకట్టుకుంది. కమల్ హసన్ కొడుకు పాత్ర చేసిన నటుడు ఆకట్టుకున్నాడు. నాజర్ , ఊర్వశి, జయరాం, పార్వతి మీనన్, పార్వతి నాయర్ మొదలగు నటీనటులు వారి పాత్రల స్థాయి మేరకు ఆకట్టుకున్నారు..

కథ మరియు కథనం బాధ్యతలను కమల్ హసన్ తన భుజాల మీదకు వేసుకున్నారు, కథ చాలా అద్భుతమయిన కథ ఒక నటుడి తపన ఆపలేని పరిస్థితి లాంటి సందర్భాలను చాలా బాగా పొందుపరిచి ఏర్పాటు చేసిన కథ ఇది, కాని కథను చెప్పే విధానంలో అతి దారుణంగా ఫెయిల్ అయ్యారు. కథనం నిజానికి చాలా బాగుంటుంది కాని గ్రిప్పి గా సాగదు. సరళంగా సాగే రెండు కథలకు అద్భుతమయిన లింక్ లు పెట్టారు కాని సన్నివేశాలు అనవసరం అని గ్రహించలేకపోయారు ఒక్కసారి అర్ధం అయ్యేలా చెప్పేసిన పరిస్థితిని మళ్ళీ మళ్ళీ చెప్పడం కూడా కథనం లో ఉన్న కీలక లోపం.. దర్శకత్వం విషయంలో కూడా  తడబడ్డారు, అంత గొప్ప నటన ప్రదర్శన ఉన్నా కూడా పాత్రల మీద పట్టు సాదించలేకపోయారు. సినిమాటోగ్రఫీ అందించిన శ్యాందత్ , ప్రదేశాలను అద్భుతంగా తెరకెక్కించారు మొదటి పాటలో టర్కీ అందాలను మిగిలిన చిత్రంలో ఆర్ట్ వర్క్ ను అద్భుతంగా చూపించారు. ఘిబ్రన్ అందించిన పాటలు బాగున్నాయి అంతే అందంగా తెర మీదకు కూడా ఎక్కించారు. నేపధ్య సంగీతం అయితే కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోసింది.. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది , ఎడిటింగ్ ఇంకా చాలా మెరుగ్గా ఉండవలసింది. చిత్రంలో అనవసర సన్నివేశాలే కాకుండా సాగాదీత కూడా ఎక్కువ కనిపిస్తుంది ఇంకాస్త కటువుగా కొన్ని సన్నివేశాలను కత్తిరించి చిత్ర నిడివి తగ్గించి ఉంటె బాగుండేది. నిజానికి ఈ చిత్రంలో ఉత్తముడి కథ పూర్తిగా అవసరం లేదనిపిస్తుంది ఈ విషయాన్నీ ఎడిటర్ గమనించి ఉంటె మరింత బాగుండేది.. తిరుపతి బ్రదర్స్ మరియు రాజ్ కమల్ ఫిల్మ్స్ వారు అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎక్కడా రాజీ పడినట్టు అనిపించదు. 

"కళాకారుడు మరణించినా మృత్యుంజయుడు" అన్న విషయాన్నీ చెప్పాలి అని ప్రయత్నించారు కమల్ హాసన్, నిజానికి ఈ చిత్రంలో క్లాసిక్ కి కావలసిన ఉన్నాయి కాని ఇది కనీసం ఆకట్టుకోలేకపోయింది అంటే రచనలో ఉన్న బలహీనత తెలిసిపోతుంది. ఇదే చిత్రం అనుకున్న విధంగా తీసి ఉంటె ప్రతి ప్రేక్షకుడి చేత కన్నీరు పెట్టించగల సత్తా ఉన్న అంశం ఇది, ఒక చిత్రంకి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోతే ఎటువంటి సన్నివేశం అయినా పేలవంగానే అనిపిస్తుంది కాని ఈ చిత్రంలో ప్రేక్షకుడు కనెక్ట్ కాకపోయినా మూడు సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడిని కట్టిపడేసి కన్నీళ్లు పెట్టిస్తాయి. అంతటి అద్భుతమయన సన్నివేశాలు అవి , అవి చూసాకనే చిత్రంలో ఉన్న ఘాడత తెలుస్తుంది. మంచి కాన్సెప్ట్, మంచి నటన , మంచి సంగీతం , ఇంకా మంచి నేపధ్య సంగీతం , కొన్ని అద్భుతమయిన సన్నివేశాలు , మంచి సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఉన్నా కూడా రచన బాగోలేకపోవడం మరియు దర్శకత్వం పేలవంగా ఉండటం , ఎడిటింగ్ మూలాన మంచి చిత్రం కాస్త మట్టి పాలయిపోయింది..  ఈ చిత్రంలో పలు అంశాలు కమల్ హసన్ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది.. ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్చు.. 

Kamal Hassan,Andrea Jeremiah,Pooja Kumar,Ramesh Aravind,N. Lingusamy,M. Ghibran.ఉత్తమ విలన్ : తెర మీద నటుడి కష్టం తెర ముందు ప్రేక్షకుడిది ..

మరింత సమాచారం తెలుసుకోండి: