విష్ణు స్టైలింగ్ మరియు స్టంట్స్ , ప్రణీత అందాల ఆరబోత విష్ణు స్టైలింగ్ మరియు స్టంట్స్ , ప్రణీత అందాల ఆరబోత పై రెండు కాకుండా మిగిలినవి అన్ని

శివాజీ(మంచు విష్ణు) ఒక సాధారణ యువకుడు తన కళ్ళ ముందు ఏదయినా తప్పు జరిగితే నిలదీసి అడిగే వ్యక్తిత్వం కలవాడు. ఇతనికి అనామిక(ప్రణీత) పరిచయం అవుతుంది, ఇద్దరు ఒక రెస్టారెంట్లో డేట్ కి కలవాలి అని నిర్ణయించుకుంటారు. వీరి మధ్య బంధం పెరిగి బలపడుతున్న సమయంలో అనామిక శివాజీ చూస్తుండగానే కిడ్నాప్ కి గురవుతుంది, ఆమెను కాపాడాలి అన్న శివాజీ ప్రయత్నం విఫలం అవుతుంది. పోలీస్ కి కంప్లైంట్ చేసిన శివాజీ కి అనుకోని సంఘటనలు ఎదురవుతుంది. అసలు అనామిక కిడ్నాప్ కాలేదు అన్నట్టు అతను చెప్తున్నవి అన్ని అబద్దాలని పోలీస్ లను పరిస్థితులు నమ్మిస్తుంది.  కాని ఇవేవి నమ్మశక్యంగా లేదని దీని వెనుక ఏదో జరుగుతుందని ఎలాగయినా అనామికను కాపాడాలని నిశ్చయించుకుంటాడు శివాజీ. ఇక్కడ మొదలయిన అతని పరుగు ఎటువైపు  తీసింది ? అసలు అనామికను ఎవరు కిడ్నాప్ చేసారు? ఎందుకు కిడ్నాప్ చేసారు? వీటన్నింటికి రిషి దేవ్ (జేడి చక్రవర్తి) కి ఉన్న సంభంధం ఏంటి అనేది తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే..

మంచు విష్ణు ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు , స్టంట్స్ విషయంలో కాని శరీర ఆకృతి విషయంలో కాని చాలా జాగ్రత్త తీసుకున్నారు. స్టైలింగ్ కూడా చాలా విభిన్నంగా ప్రయత్నించారు, గెడ్డం మరియు టాటూ అన్ని కొత్తగానే ఉన్నాయి కాని పాత్రకి సూట్ అవ్వలేదు ఒక సాధారణ యువకుడు ఒక అసాధారణ శక్తితో పోరాడటం ఈ చిత్ర సారాంశం, చిత్రం ఆసాంతం విష్ణు ఒక హీరో లా కనిపించాడు కాని సాధారణ యువకుడిలా ఎక్కడా కనిపించలేదు. ప్రణీత నిజానికి ఈ చిత్రంలో కీలక పాత్ర, నటనకు బోలెడంత ఆస్కారం ఉన్న పాత్ర కాని ఈ నటిని అందాలను చూపించడానికి ఉపయోగించినంతగా మరే విషయానికి ఉపయోగించుకోలేదు. అందాల ఆరబోతలో ప్రణీత నూటికి నూట యాభై మార్కులు సంపాదించుకుంది కాని నటన విషయం లో పాస్ మార్కులు కూడా కష్టమే.. ఏదయితేనే ఆమె అందంతో ఆకట్టుకోవాలన్న దర్శకుడి  యొచనకి న్యాయం చేసింది. జేడి చక్రవర్తి పాత్ర గురించి చెప్పాలంటే ఒక సమస్య ఉంది నిజానికి "డైనమైట్" అనే చిత్రంలో జేడి  చక్రవర్తి నటించింది కేవలం పది నిమిషాలు మాత్రమే పూర్తిగా రెండు గంటలు కూడా షూటింగ్ లో పాల్గొనే అవసరం లేదంటే ఊహించుకోండి , సమస్య ఏంటంటే ఈ చిత్రం "అరిమ నంబి" రీమేక్ అని తెలిసిందే కాని జేడి చక్రవర్తి పాత్ర మాత్రం డబ్బింగ్ అని చెప్పుకోవాలి. అక్కడ సన్నివేశాలను కట్ చేసి ఈ చిత్రంలో పేస్ట్ చేసి డబ్ చేయించారు. కాబట్టి నిజానికి ఈయన పాత్ర గురించి చెప్పాలంటే "అరిమ నంబి" అనే చిత్రంలో ఈయన నటన గురించి చెప్పాలి.  ఇది పక్కన పెడితే ఒక తెలివయిన ప్రతినాయకుడికి ఉండవలసిన బాడీ లాంగ్వేజ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ని అద్భుతంగా కనబరిచారు.  డైనమైట్ లో ఈయన నటన గురించి చెప్పడానికి ఎం లేదు ఎందుకంటే చివరి పది నిమిషాలు మాత్రమే ఈయన ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా నటించారు. నాగినీడు, ప్రవీణ్ , పరుచూరి వెంకటేశ్వర రావు , రాజరవింద్ర ఉన్న కాసేపు ఆకట్టుకున్నారు. ఇక కట్ పేస్ట్ పాత్రలు పోషించిన యొగ్ జపీ మరియు లేఖ వాషింగ్టన్ మాతృక లో ఆకట్టుకున్నారు. వారి పాత్రలను డబ్ చేసారు కాబట్టి  ఈ చిత్రం కోసం నటించినట్టు పరిగణించడం సమంజసం కాదు..కాని ఇరువురు వారి పాత్రలకు తగ్గ న్యాయం చేసారు. 

కథ ఎలాగు మాతృక నుండి తీసుకున్నారు , అరిమ నంబి కథనం మరియు పాత్రల తీరుతెన్నుల మీద నడుస్తుంది. కథనం విషయంలో మాతృకకు ఈ చిత్రానికి పెద్ద తేడా లేదు కాని చిత్రాన్ని తెలుగీకరించడానికి దర్శకుడు అతి సాదాసీదా సన్నివేశాలను అనవసర పాటలను బలవంతంగా జొప్పించారు. థ్రిల్లర్ అంటే ముఖ్యమయినది వేగం, ఈ చిత్ర కథనంలో వేగం అయితే ఉంది కాని బలం లేదు, హీరో  మాములు వ్యక్తి అంతుపట్టని ఒక శక్తితో పోరాడుతున్నాడు ఇది మాతృక సారాంశం , ప్రతి ప్రేక్షకుడు నాకు అలాంటి పరిస్థితి ఎదురయితే ఇలానే ఉంటుందేమో అన్నట్టు ఉంటుంది. తెలుగులో విష్ణుకి కావలసినంత బిల్డప్ ఇచ్చి పాత్రను మొదలుపెట్టారు అక్కడితోనే ప్రేక్షకుడికి ఆ పాత్ర చాలా దూరం అయిపోయింది. ఇక ప్రణీత పాత్రతో చేయించిన అనవసరమయిన అందాల ఆరబోత మీద దృష్టి ఎక్కువ అయ్యి ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను మరిచిపోయేలా చేసింది. ఇది యాక్షన్ చిత్రమే కావచ్చు కాని  సరయిన కారణం లేని ఫైట్స్ లేదా  స్టంట్స్ ప్రేక్షకుడి మీద ఎటువంటి ప్రభావం చూపించదు. హీరో ఆ పాత్రను కొడితే బాగుణ్ణు అన్న ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలగనంతవరకు హీరో ఎన్ని  గంతులేసి కొట్టినా ఎంత స్టైలిష్ కొట్టినా ఉపయోగం లేదు.

ఎంతో కష్టపడి విష్ణు చేసిన స్టంట్స్ అన్ని ఇలానే వృథా అయిపోయాయి. తెలుగీకరించడానికి కథనంలోనికి జొప్పించిన పాటల వలన మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. బివిఎస్ రవి అందించిన మాటల్లో పదును లేదు బలం లేదు అసలు రెండు మూడు డైలాగ్ లు తప్ప మరేవి ఆకట్టుకోలేదు . గతంలో దేవా కట్ట చేసిన చిత్రాలను చూసాక ఈ చిత్రాన్ని చూస్తే ఈ చిత్రం ఆయనే చేసారా అన్న సందేహం వస్తుంది ఇప్పటివరకు అయన  చిత్రాలలో దర్శకుడిగా ఇంత ఘోరంగా ఏ చిత్రంలోనూ విఫలం అవ్వలేదు ఇకముందు కూడా అవ్వకూడదు అని కోరుకుంటున్నాం. సినిమాటోగ్రఫీ చెప్పుకో దగ్గ స్థాయిలో లేదు రాత్రి వేళలో తెరకెక్కించిన సన్నివేశాల నాణ్యత దారుణంగా ఉంది. పాటలు మరియు కొన్ని సన్నివేశాలు మాత్రం బాగా తెరకెక్కించారు. అచ్చు అందించిన సంగీతంలో ఉన్న మూడు పాటలు అంతంతమాత్రమే . చిన్నా నేపధ్య సంగీతం అనవసరంగా బిగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది చిత్రంలో కావలసినంత టెన్షన్ ఉంచడంలో నేపధ్య సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది ఈ విషయంలో చిన్నా విఫలం అయ్యారు. ఎడిటింగ్ విషయానికొస్తే కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా స్టంట్స్ వద్ద అనవసరమయిన జుంప్స్ ఉంటాయి, పరిపూర్ణత కనపడదు ఈ సన్నివేశాలలో ఈ సన్నివేశాలను ఇలానే తీసారో లేదా ఎడిటింగ్ మూలాన ఇలా  అయ్యిందో తెలియలేదు.

ఈ విషయాన్నీ పక్కన పెడితే చిత్ర నిడివి తక్కువే అయినా చిత్రంలో చాలా పొడవయిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ కట్ చేసి ఉంటె బాగుండేది. ఈ చిత్ర నిర్మాణ విలువల గురించి చెప్పాలంటే. చాలా సన్నివేశాలను మరోసారి తెరకెక్కించడం అవసరం లేదనుకొని డబ్ చేసి అలానే పెట్టేసారు సన్నివేశాలు మాత్రమే కాదు ఒక పాట కూడా అలానే చేసారు. తమిళ చిత్రంలో ని పాట విజువల్స్ కి తెలుగు పాటను అతికించారు. చిత్రంలో దాదాపు నలభై శాతం కట్ - పేస్ట్ సన్నివేశాలు. దీనికన్నా "అరిమ నంబి" అనే చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి హీరో కి విష్ణు చేత డబ్బింగ్ చెప్పించి ఉంటె బాగుండేది. 



ఒక చిత్రాన్ని రీమేక్ చెయ్యడం అంటే ఆ చిత్రంలో ఏదయినా లోపాలు ఉంటె సరిచేసుకొని తెరకెక్కించడం. నిజానికి "అరిమ నంబి" అంత గొప్ప చిత్రం కాదు తమిళంలో కూడా యావరేజ్ గా నడిచింది. మరి అటువంటి చిత్రాన్ని తీసుకొని ఎక్కడ లోపం ఉందో చూసుకొని తెరకేక్కించవలసిన చిత్రాన్ని మరిన్ని లోపాలతో తెరకెక్కిస్తే "డైనమైట్" చిత్రంలా కనిపిస్తుంది. కష్టపడటం కాదు కష్టాన్ని ఎందులో పెడుతున్నామో ఒకసారి గమనించుకోవలసిన అవసరం మంచు సహోదరులకి కచ్చితంగా ఉంది ఎందుకంటే వీరి చిత్రాలలో వీరి కష్టం లోపించడం ఎప్పుడు గమనించలేదు కాని సమస్య కథనం తోనే వస్తుంది. తమిళ్ వచ్చినవాళ్ళు మాతృకను ఒకసారి చూడవచ్చు. తమిళం అర్ధం కానివాళ్ళు ఓపిగ్గా ఒక్కసారి ప్రయత్నించదగ్గ చిత్రం "డైనమైట్".. 

Manchu Vishnu,Pranitha,Deva Katta,Achu డైనమైట్ - పేల్చలేదు .. పేలలేదు ..

మరింత సమాచారం తెలుసుకోండి: