తను చెప్పే మాటలు సీరియస్‌ డైలాగులో? వెటకారపు వ్యాఖ్యానాలో జనానికి అర్థం కాకుండా మాట్లాడే టెక్నిక్‌ కొందరికి ఉంటుంది. మాట్లాడేసిన తర్వాత.. ఆ వాక్యాలను సందర్భానికి తగినట్లు తమకు ఎలా కావలిస్తే అలా మార్చుకోగలరన్నమాట. అలాంటి డైలాగుల్లో.. సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కూడా.. ముదిరిపోతున్నట్లుగా తాజా ట్వీట్లు చూస్తే అర్థమవుతోంది. మామూలుగా అయితే చాలా సూటిగా, కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే అలవాటున్న రాంగోపాల్‌ వర్మ.. తాజాగా నర్మగర్భపు మాటలు వాడడం కూడా నేర్చుకుంటున్నాడు. కాకపోతే.. మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన సోదరుడు పవన్‌ కల్యాణ్‌ ల మీద ఇలాంటి సెటైర్లను సంధిస్తూ ఉండడమే చిత్రంగా ఉంది. 


ఇటీవలే.. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ప్రెస్‌మీట్‌ తర్వాత.. ఆయన నిరుత్సాహపరిచేశాడంటూ ట్వీట్లు చేసిన రాంగోపాల్‌వర్మ.. తన స్మార్ట్‌ఫోనుతో.. చిరంజీవి 150 వ చిత్రాన్ని ఓ ఆటాడుకుంటున్నారు. ఏది ఏమైనా సరే.. మెగాస్టార్‌ 150 వ చిత్రం అనేది బాహుబలిని మించిన చిత్రం కావాలనే అభిలాషను (?) వ్యక్తం చేస్తూ రాంగోపాల్‌ వర్మ ఆయన ముందరి కాళ్లకు ముందుగానే బంధం వేస్తున్నారు. అది ఎటూ సాధ్యం కాదనే క్లారిటీ వర్మకు బాగానే ఉన్నట్లుంది. 


వర్మ ట్విట్స్ 


ఇంతకూ వర్మ ఏం కామెంట్‌ చేశారో తెలుసా..? ''చిరు చిత్రాన్ని ఏ ఇతర దర్శకులూ బాహుబలిని మించి తీసే అవకాశం లేదని ఆయన అభిమానులు భావిస్తున్నారని, తనచిత్రానికి స్వయంగా చిరంజీవి దర్శకత్వం వహిస్తే మాత్రమే అది సూపర్‌ హిట్టవుతుంద''ని ఆయన అంటున్నారు. ఒకవేళ మెగాస్టార్‌ మెగాఫోన్‌ పట్టుకోడానికి ఇష్టపడకపోతే గనుక.. పవన్‌ కల్యాణ్‌ దర్శకత్వం వహించాలని కూడా ఓ సలహా పారేస్తున్నాడు. పవన్‌ కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తే గనుక.. అంతకంటె పెద్ద సినిమా ఉంటుందా? అని మెగా అభిమానులకు ఓ ప్రశ్న కూడా సంధించాడు. పవర్‌స్టార్‌ దర్శకత్వం- మెగాస్టార్‌ నటన కలిస్తే.. 'మెగా బాహుబలి' అవుతుందనడం కొసమెరుపు. 


ఇంతకూ చిరంజీవి గతంలో చాలా సందర్భాల్లో దర్శకత్వం గురించి పలువురు ప్రశ్నిస్తే ఆ రంగం అంటేనే తనకు చాలా భయం అని వెల్లడించారు. అదే పవన్‌ కల్యాణ్‌.. ఫ్లాప్‌ చిత్రం దర్శకుడిగానే పేరున్న వ్యక్తి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని వర్మ అంట.. మరి అది.. వెటకారమే కావచ్చునని, ఆశాభావం కాదని అంతా అంటున్నారు. 


మెగాస్టార్‌ చిరంజీవి 150 చిత్రం చేసేట్లయితే.. చెబితే తాను డైరక్ట్‌ చేస్తానని.. లేదా అసిస్టెంట్‌ డైరక్టర్‌గానైనా చేస్తానని గతంలో వర్మ సినీ ఫంక్షన్లలో సమయానుకూల డైలాగులు కొన్ని వేశారు. అలాంటి అవకాశాలేవీ తనకు దక్కలేదనే దుగ్ధతో చిరు మీద ఈ పరోక్ష సెటైర్లు వేస్తున్నారా లేదా, ఆయన సినిమా గురించి తన ట్వీట్లకు చిరు అభిమానులు స్పందిస్తున్న దుందుడుకు తీరుతో చిరాకెత్తి ఇలా సెటైర్లు వేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: