ఏపీలో ఎన్నికలు ఈసారి హోరా హోరీగా సాగాయనడంలో సందేహం లేదు. అటు టీడీపీ, ఇటు వైసీపీ కసిగా పోరాడాయి. ఏ ఒక్క అవకాశం కూడా జారవిడుచుకోలేదు. మరో వైపు సినీ నటుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా మూడవ పక్షంగా ముందుకు వచ్చింది. ఈసారి హైలెట్ అదే. టాలీవుడ్ నుంచి పదేళ్ళ తరువత ఓ ప్రముఖ నటుడి ఆద్వర్యంలో రాజకీయ పార్టీ రంగంలో ఉండడంటో అందరి కళ్ళు ఇటువైపు ఉన్నాయి.


ఇక సినిమా రంగానికీ టీడీపీకి ఉన్న బంధం వేరేగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ పుట్టుకే సినిమా దైవం అన్న నందమూరి తారకరామారావు చేతుల మీదుగా జరిగింది. ఇక ఉమ్మడి ఏపీలో మొత్తం తారాలోకం ఆంతా చంద్రబాబు వైపే ఉండేవారు. విభజన తరువాత టాలీవుడ్ హైదరాబాద్ లో  ఉండడంతో అక్కడ టీయారెస్ తో  రాజకీయ అవసరాలు పెరిగి జై కొడుతున్నారు. అయినా సరే ఏపీలో తమ పార్టీ టీడీపీ గెలవాలనుకునే జనమే టాలీవుడ్లో ఎక్కువ.



ఈ మధ్య కాలంలో వైసీపీకి కూడా టాలీవుడ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. జగన్ని అనేకమంది సినిమా తారలు కలసి మద్దతు ప్రకటించారు. ప్రచారం కూడా చేశారు. మోహన్ బాబు, జయసుధ, ఆలీ, రాజశేఖర్, జీవిత,  పోసాని క్రిష్ణ మురళి, ఎస్వే క్రిష్టారెడ్డి,  థ‌ర్టీ  యియర్స్ ఇండస్ట్రీ ప్రుద్వీ, వినాయకుడు ఫేం రాజు ఇలా అనేకమంది సినిమా నటులు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు.  ఇపుడు రాజకీయ నేతలు, పార్టీలతో పాటు టాలీవుడ్ కూడా ఏపీ ఫలితాలపైన ఆసక్తిగా ఉందని అంటున్నారు.



బాబు సీఎం అయితే టాలీవుడ్ లో ఓ బలమైన వర్గం ముందుకు వస్తుంది. అదే జగన్ గెలిస్తే మరో వర్గం దూకుడు మీద ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయం కూడా అంతా  జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆయన ఏమైనా  సక్సెస్ అయితే మరింతమంది సినీ జనం ఈ వైపుగా వస్తారని కూడా అంటున్నారు. తేడా కొడితే మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు టాలీవుడ్లో మెజారిటీ జనం  ఇకపై దూరంగా ఉంటారని ప్రచారం సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: