2009 సమైక్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తన అన్న చిరంజీవి ‘ప్రజారాజ్యం’ ఎన్నికల కోసం పవన్ తన సినిమాలను కూడ పక్కకు పెట్టి అలనాటి ‘ప్రజారాజ్యం’ అనుబంధ సంస్థ యువరాజ్యం అధినేతగా ఆంధ్రా తెలంగాణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేసినా అప్పట్లో ప్రజారాజ్యంకు వచ్చిన ఓట్లు 18శాతం మించలేదు. ఆతరువాత కొన్ని సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ తిరిగి 2014 ఎన్నికల్లో ‘జనసేన’ పార్టీని ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల విజయం కోసం జనం మధ్యకు వచ్చినప్పుడు అప్పటి ఓటర్లు పవన్ పిలుపుకు స్పందించారు.

ఆ తరువాత ఇప్పుడు 2019 ఎన్నికలలో పవన్ తన సొంతబలం నిరూపించుకునేందుకు ‘జనసేన’ తరపున ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు పోటీ చేసి కింగ్ మేకర్ అవ్వాలని సినిమాలను కూడ వదులుకుని గత సంవత్సర కాలంగా జనం మధ్య తిరిగాడు. రాజకీయాలలో మార్పులు తీసుకు రావాలి అంటే ప్రజల సహకారం కావాలనీ తాను ప్రజల కోసం 25 సంవత్సరాల భవిష్యత్ ను ఆలోచిస్తూ రాజకీయాలలోకి వచ్చానని అనేక సందర్భాలలో చెపుతూ జయాపజయాలు తనను ప్రభావితం చేయవు అన్న సంకేతాలు ఇచ్చాడు.

కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తాను అంటూ జనం మధ్య ప్రజాపోరాట యాత్రను కొనసాగించిన పవన్ కు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలలో అదేవిధంగా ఉత్తారాంధ్ర జిల్లాలలో పవన్ ‘జనసేన’ కు ఎక్కువ ఓట్లు పడినట్లు అంచనాలు వస్తున్నాయి. మీడియా సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పవన్ ‘జనసేన’ కు 10 శాతం వరకు ఓట్లు పడినట్లు అంచనాలు తెలియచేస్తున్నాయి.

అయితే చిరంజీవికి ప్రజారాజ్యం ఎన్నికల సమయంలో వచ్చిన ఓట్ల శాతం కంటే పవన్ కు ఈ ఎన్నికలలో తక్కువ ఓట్ల శాతం వస్తాయి అని వార్తలు రావడం బట్టీ ఓటర్ల పై మెగా హీరోల మ్యానియా తక్కువ ప్రభావం చూపెట్టిందా అన్న సందేహాలు కలగడం సహజం. అయితే గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా జనజీవన స్రవంతిలో కొనసాగుతాను అని సంకేతాలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ దశాబ్ద ప్రస్థానానికి రేపు జరగబోయే ఓట్ల లెక్కింపులో ఎన్ని శాతం ఓట్లు వస్తాయి అన్న విషయం పై పవన్ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: