సప్తగిరి...ఈ పేరు ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే మంచి కమెడియన్‌గా వినిపించింది. అయితే అంతే తక్కువ కాలంలో హీరోగాను టర్న్ తీసుకున్నాడు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన అసలు కారణం ఇది కాదట. హీరోగా నా తొలి సినిమా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'కి పేరు, డబ్బులు వచ్చాయి. రెండో సినిమా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'కి పేరు మాత్రమే వచ్చింది. ఈ సినిమాకు పేరూ డబ్బులు... రెండూ రావాలని కోరుకుంటున్నా.. అని సప్తగిరి అంటున్నాడు. అరుణ్‌ పవార్‌  దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మించిన 'వజ్రకవచధర గోవింద' ఈవారం విడుదలవుతోంది. 


ఈ సినిమాలో దొంగ పాత్రలో నటించాడు. ఓ వజ్రానికీ, ఆ దొంగకు సంబంధం ఏంటి? వజ్రం వల్ల అతడికి వచ్చిన కష్టాలేంటి? లాభాలేంటి? ఈ క్రమంలో ఎంత నవ్వించాడు? ఏడిపించాడు? అనేది కథని సమాచారం. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సప్తగిరి కథానుగుణంగా మూడు గెటప్పుల్లో కనిపిస్తాడట. అయితే  కమెడియన్‌గా క్యారెక్టర్స్‌ చేయడానికి కూడా ఎప్పుడూ సిద్ధమే అని కూడా అంటున్నాడు. అయితే హీరోగా టర్న్ తీసుకున్నందుకో ఏమో కానీ, కమెడియన్‌గా అవకాశాలు రావడం లేదని వాపోతున్నాడు. 


అసలు, నేను కమెడియన్‌ కావాలని ఇండస్ట్రీకి రాలేదు. కృష్ణవంశీ 'సింధూరం', శంకర్‌ 'భారతీయుడు' చూసి దర్శకుడు అవుదామని వచ్చాను....అంటు అసలు విషయం చెప్పాడు. 'ప్రేమకథా చిత్రమ్‌' సినిమా స్ఫూర్తితో 'దెయ్యం పట్టింది' అని రెండు కథలు సిద్ధం చేసుకున్నాడట. ఎప్పటికైనా ఈ రెండు కథలను తెరపైకి తెస్తాడట.  



మరింత సమాచారం తెలుసుకోండి: