దేవలోకం నుంచి వచ్చిన ఓ దేవకన్య ఉంగరం పొగొట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ భూలోకానికి వస్తుంది’ ఇది నిర్మాత అశ్వనీదత్‌కు చక్రవర్తి అనే రచయిత చెప్పిన లైన్‌. దీని ఆధారంగా సినిమా కథ తయారు చేశారు. అయితే, చిరంజీవి-శ్రీదేవి అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. దానికి తగ్గట్టుగా సన్నివేశాలు ఉండాలి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసే తొలి సన్నివేశంపైనే తర్జనభర్జనలు పడింది చిత్ర బృందం.

 

తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోలేని చిత్రాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఒకటి. ‘మెగాస్టార్‌’ చిరంజీవి కథానాయకుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇంద్రుడి కుమార్తె ఇంద్రజగా శ్రీదేవి అందం.. నటనతో యావత్‌ ప్రేక్షకలోకాన్ని ఫిదా చేసేశారు. సినిమాలో వీరు మానస సరోవరంలో ఒకరికి తెలియకుండా ఒకరు కలుసుకున్నట్లు చూపించారు.

 

అయితే, తొలుత అనుకున్న కథ ప్రకారం.. ‘గాయాల పాలైన పాపకు వైద్యానికి లక్షలు ఖర్చవుతాయి. అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుడిపైకి ఒక మిషన్‌ను నిర్వహించాలనుకుంటుంది. స్పేస్‌షిప్‌లో చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి లక్షల్లో డబ్బు ఇస్తానని చెబుతుంది. ఆ ప్రకటన చూసి చిరంజీవి స్పేస్‌షిప్‌లో చంద్రుడిపైకి వెళ్తారు. అక్కడ విహారానికి వచ్చిన శ్రీదేవి ఉంగరం పోగొట్టుకుంటుంది. అది చిరంజీవి దొరకడంతో దాన్ని వెతుక్కుంటూ శ్రీదేవి భూమ్మీదకు వస్తుంది’ ఇది పూర్తి కథ సిద్ధం కాకముందు అనుకున్న ఒక థీమ్‌.

 

అయితే, చంద్రుడు, స్పేస్‌షిప్‌ ఇవన్నీ సహజంగా ఉండవని దర్శకుడు రాఘవేంద్రరావు, చిత్ర బృందం భావించిందట. దీనిపై చర్చిస్తుండగా, ‘మానససరోవరం అయితే ఎలా ఉంటుంది’ అని చిరంజీవి అనడంతో అందరికీ నచ్చి, కథను ఆ దిశగా మార్చారు రచయితలు. అలా చిరంజీవి మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లడం.. అక్కడ విహారానికి వచ్చిన శ్రీదేవి ఉంగరం పోగొట్టుకోవడం.. దాని కోసం మళ్లీ భూమ్మీదకు రావడాన్ని మనం తెరపై చూశాం.


మరింత సమాచారం తెలుసుకోండి: