ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య ఎన్నికల కోసం ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకున్నారు. బాలయ్య తాజా ఎన్నికల్లో హిందూపురం నుంచి టిడిపి తరఫున పోటీ చేసి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టిడిపి చిత్తుగా ఓడిపోవడంతో మరో ఐదేళ్ళ పాటు బాలయ్యకు రాజకీయంగా ఎలాంటి పని ఉండదు. దీంతో మళ్లీ సినిమాల్లో చేసుకునేందుకు రెడీ అయిపోయారు. ఈ క్రమంలోనే తనకు జై సింహా లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో తన 105వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాకు రూల‌ర్‌ లాంటి పవర్ ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే బయటికి వచ్చింది. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా స్టోరీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని... ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు ఉంటాయని చాలా ప్రచారం జరిగింది. వీటికి నిర్మాత సీ కళ్యాణ్ చెక్ పెట్టేశారు. బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్ స్ట‌ర్‌గా మారితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నార‌ట‌.

బాలయ్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుంద‌ట‌. అయితే డ్యూయ‌ల్ రోల్ కాదట. ఇక జై సింహలో బాలయ్య ఇలాగే రెండు వేరియేషన్స్‌ ఉన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇలా బాలయ్య గ్యాంగ్ స్టర్ గా నటించడం మొదటిసారి కాదు. గతంలో యువ‌ర‌త్న రాణా, అశోక చ‌క్ర‌వ‌ర్తి లాంటి సినిమాల్లో ఈ రోల్ చేసినా ఈ రెండు సినిమాలు ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు.  

పోలీస్‌గా న‌టించిన రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్‌, ల‌క్ష్మీ న‌ర‌సింహా సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు అటు పోలీస్‌, ఇటు గ్యాంగ్‌స్ట‌ర్ రోల్స్ మిక్స్ చేసుకుని వ‌స్తోన్న ఈ సినిమాపై మాస్‌లో, బాల‌య్య ఫ్యాన్స్‌లో అంచ‌నాలు ఉన్నాయి. శాతకర్ణి, జై సింహాలకు సంగీతం అందించిన చిరంతన్ భట్ మూడో సారి బాలయ్య కోసం ట్యూన్స్ కడుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: