మా తొలి పరిచయం బాపు గారి ‘సాక్షి’ సినిమాసెట్స్‌లోనే. తెలుగులో ఆమెకది అయిదో సినిమా అనుకుంటా. నేను నటుడిగా అప్పటికి నాలుగైదు సినిమాలు చేశా. అంతే. ‘సాక్షి’ సెట్స్‌లోనే మా స్నేహం, క్రమంగా ప్రేమ మొదలయ్యాయి. 1969 మార్చి 24న మా పెళ్ళయింది. సరిగ్గా ఈ ఏడాదికి మాది యాభయ్యేళ్ళ పైచిలుకు వివాహ బంధం. నేను తనను ‘నిర్మలా’ అని పిలుస్తాను. ఆమె బయట నన్ను ‘కృష్ణ గారు’ అని ప్రస్తావించినా, ఇంట్లో ‘ఏమ్మా...’ అని ప్రేమగా పిలిచేది. అప్పట్లో నటుడు రాజబాబు మా ప్రేమకు దోహదం చేశాడు.

 

నిర్మల మంచి నటే కాకుండా మంచి మనిషి కావడం నన్ను ఆమె పట్ల ఆకర్షితుడినయ్యేలా చేసింది. ఆమెలోని మంచితనం, సహాయపడే గుణం నాకు బాగా నచ్చాయి. మా ప్రేమ ఎలా డెవలప్‌ అయిందో కానీ, వరుసగా కలసి సినిమాలు చేయడంతో పెళ్ళి దాకా వెళ్ళింది. అప్పటికే పెళ్ళయినా, సమాజం గురించి కానీ, వచ్చే విమర్శల గురించి కానీ ఆలోచించలేదు. పెళ్ళి చేసుకున్నాం. నిర్మాత భావనారాయణ గారు పెద్దరికం.

 

మిత్రుడైన హీరో చంద్రమోహన్‌, రమాప్రభ, ఎస్‌.పి. వెంకన్నబాబు, (ప్రతాప్‌ ఆర్ట్స్‌) రాఘవ, జర్నలిస్టు ‘కాగడా’ శర్మ ... ఇలా కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో తిరుపతిలో పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళయ్యాక మేము కలసి నటించిన తొలి చిత్రం అంజలీదేవి, ఆదినారాయణరావు గార్ల సొంత సినిమా ‘అమ్మ కోసం’ (నిర్మాణంలో ఆలస్యమై, 1970 మార్చి26న రిలీజ్‌). ఆ సినిమా షూటింగులో నాగయ్య గారు తదితరులు మమ్మల్ని ఆశీర్వదించి, అండగా నిలిచారు.

 

అదే సమయంలో నిర్మాత డి. రామానాయుడు గారి సినిమా ‘బొమ్మలు చెప్పిన కథ’ (1969 ఏప్రిల్‌ 4)లో నిర్మల నాకు చెల్లెలుగా చేసింది. అది రిలీజైంది. ‘‘ఏమయ్యా! ఈ టైములో ఇలా చేశారు’’ అంటూ నవ్వుతూ కామెంట్‌ చేశారు. గమ్మత్తేమిటంటే, కాస్త అటూ ఇటూగా ఆ టైములోనే నేను ‘మంచిమిత్రులు’ (1969 జనవరి 12), ‘ముహూర్తబలం’ (1969 జూన్‌ 13) లాంటి కొన్ని చిత్రాల్లో కూడా నిర్మల, నేను తోబుట్టువులుగా చేశాం. మా ప్రేమ, పెళ్ళి... అప్పట్లో ఓ సంచలనం.


మరింత సమాచారం తెలుసుకోండి: