ఒకప్పుడు రిపోర్టర్లు ఎవరైనా ఒక వార్త రాసినందుకు డబ్బు తీసుకుని ఉంటే అది అవసరం. ఆ తర్వాత తీసుకున్నవాళ్లది వారసత్వంగా, తరవాత అలవాటుగా, ఇప్పుడు లక్షణంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే బెదిరింపులకు  కూడా పాల్పడుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ వ్యవహారం మరింత దుర్మార్గంగా ఉందని కొందరు వాపోతున్నారు. ప్రెస్ మీట్ అంటేనే కవర్లు పంపిణీ కార్యక్రమం లాగా మారిపోయిందిప్పుడు. ఇచ్చేవాళ్లు పైకి నవ్వుతూ ఇచ్చి ముష్టికింద భావిస్తోంటే..తీసుకునే వాళ్లు దాన్ని హక్కు కింద అనుకుంటూ ఉండడం చాలా మందికి అంతుచిక్కని విషయం. ఇస్తే తీసుకోవడం పర్లేదు అనుకునేది కాస్తా.. ఇవ్వకపోతే ఊరుకునేది లేదు.. అనే తరహాలోకి మారిపోయింది.  

అయితే సినీ ఇండస్ట్రీలో ప్రెస్ మీట్లలో కవర్లు ఇచ్చే సంస్కృతికి చరమగీతం పాడాలని తమిళ పరిశ్రమ నిర్ణయించడం విశేషం. ఈ విషయంలోనే తమిళ నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకుంది. ప్రెస్ మీట్లకు వచ్చే రిపోర్టర్లకు కవర్లు ఇవ్వకూదని, లంచ్ డిన్నర్ లాంటివి కూడా మానేసి, కేవలం టీ ఎరేంజ్ చేస్తే చాలని నిర్ణయించారు. 
అయితే.. తెలుగు సినీనిర్మాతల మండలి కూడా అదే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ కూడా ప్రెస్ కు కవర్లు పంపిణీ చేయడం చాలా ఎక్కువే. నిర్మాతల బాధ ఏంటంటే... కవర్లు తీసుకుంటున్నారు సరే.. తమకు పాజిటివ్ ప్రచారం ఇవ్వడం లేదని! ఆ మధ్య ఓ  మీడియం బడ్జెట్ సినిమాకు ఒక్కొక్కరూ రెండేసి లక్షలు తీసుకుని.. రివ్యూలు కాస్త లేటుగా ఇవ్వమన్న రిక్వెస్టును లెక్క చేయకుండా.. వెంటనే ఇచ్చేసి కలెక్షన్లకు డ్యామేజీ చేశారని గగ్గోలు పెట్టడం! 

ఒక రకంగా చూస్తే.. మీడియం బడ్జెట్ సినిమాకు ప్రెస్ కవర్లు, అడ్వర్టయిజ్ మెంట్ల ఖర్చు కలిపితే ఓ చిన్న సినిమా బడ్జెట్ అంత తయారవుతుందంటే ఖచ్చితంగా నమ్మి తీరాలి.
అగ్ర దినపత్రికలుగా చెలామణీలో ఉన్నవి.. చిన్న సినిమాకే రెండు మూడు లక్షల రూపాయలు బెదిరించి మరీ దందా వసూలు చేస్తుండడం సాధారణంగా జరుగుతోందని చాలా మంది బయటకు చెప్పుకోలేక బాధ పడుతున్నారు. అందుకే ఈ బాధలన్నీ తప్పించుకోవడానికి కవర్ల సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారట. అయితే నిర్మాతలంతా ఐక్యంగా ఒక్కమాట మీద ఉంటే తప్ప.. ఇలాంటివి సాధ్యంకాదు. ఇలాంటి నిర్ణయాలు బోలెడు అనుకుంటూ ఉంటారు గానీ.. ఆచరణలోకి వచ్చేవరకు నమ్మలేం. 


మరింత సమాచారం తెలుసుకోండి: