పబ్లసిటీ కి కాదేదీ అనర్హం అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం మాటీవి లో ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో.  ప్రస్తుతం ఏ వార్తా మాధ్యమంలో నైనా నిరంతరం నలుగుతున్న వార్త బిగ్ బాస్ గురించేనని ఖచ్చితంగా చెప్పొచ్చు.  మంచో,చెడో పది మంది ముందు మన వార్త వుందా లేదా అన్నచందాన ఈ కార్యక్రమ నిర్వాహకులకు ఉచిత ప్రచారం కల్పించడంలో మాత్రం ప్రతి ఒక్కరి వంతూ వుంది.  ఆఖరికి హైకోర్టు వరకూ వెళ్ళిన ఈ కార్యక్రమ వివాదం మరో చక్కటి వాయిదాతో మొదటి భాగం ఎటువంటి అంతరాయం లేకుండా ప్రసారం కావడానికి రాచబాట వేసుకుంది.   ఓ కార్యక్రమం బావుంటే పది మంది చూసి ఇంకో వంద మందిని చూడడానికి ప్రోత్సహిస్తారు, కాని ఇది కలికాలం ఓ అడల్ట్ కార్యక్రమాన్ని పనిగట్టుకొని ప్రచారం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు సదరు సో కాల్డ్ సెలబ్రిటీసు మరియు కొన్ని వార్తా ఛానళ్ళు.

అసలు బిగ్ బాస్ కార్యక్రమం ఎలా వుందో మాట్లాడుకునేకన్నా దానిని శరవేగంతో ప్రచారం చేస్తున్న వారి గురించి ఆలోచిద్దాం.  ముందుగా ఈ కార్యక్రమం గురించి అభ్యంతరాలు లేవనెత్తింది ఇద్దరు మహిళలు.  వీరు చెయ్యెత్తగానే మరో పది మంది వీరి వెనుక నిలబడ్డారు.  ఈ కార్యక్రమం వల్ల నష్టపోయిన వారిరువురు తప్ప ,ప్రస్తుతం పని లేని, ఈ అంశానికి అసలు సంబంధమే లేని చాలా మంది యోధులు, సమరయోధులు వారి వెన్నంటు వుంటామని ముందుకు వచ్చి వారికేమి అవగాహన లేకపోయినా టీవి చర్చాగోష్టులలో అర్ధంకాని వ్యర్ధమైన అరాచకాలు సృష్టిస్తున్నారు.  దీని వల్ల నష్టపోయిన ఆ మహిళలకు ఎటువంటి లాభం లేకపోగా, బిగ్ బాస్ కార్యక్రమానికి మాత్రం విపరీతమైన ప్రచారం లభించింది. 

దెబ్బ తగిలినవాడికి మాట సాయంతో మరిపించగల నాటి మన సమాజం ముందు అదే దెబ్బ తగిలినవాడితో తగుదునమ్మా అంటూ సెల్ఫీలు నేటి సమాజం ఏపాటిది.  వీలైతే ముందుగా నష్టపోయిన ఆ మహిళలను ఓదార్చడానికి ప్రయత్నించండి, అంతే కాని గంటలకొద్దీ కూర్చొని కార్యక్రమాన్ని వేలెత్తి చూపితే ప్రయోజనమేమీ వుండదు. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి రూపొందిస్తున్న కార్యక్రమం నలుగురు విమర్శకుల నానాయాగీ వల్ల ఆగిపోదు.  ఆఖరుగా ఒక్క మాట బిగ్ బాస్ కార్యక్రమానికి సెన్సార్ పెడితే చూడాలనుకున్నవాళ్ళు ఎలాగూ చూడకుండా వుండరు కాని ఈ అనవసర చర్చాఘోషల వల్ల చూడకూడని పసి వయస్సు వాళ్ళు కూడా చూడాలని తాపత్రయపడతారు.  ఎందుకంటే మీరంతా కలిసి బిగ్ బాస్ కార్యక్రమానికి ఇస్తున్నారు బిగ్ ప్రమోషన్.


మరింత సమాచారం తెలుసుకోండి: