ఇక తెలుగు నిర్మాతలు సినిమా షూటింగుల కోసం కాశ్మీర్ కు క్యూకడతారా.. ఊటీ, కేరళ, అరకు వంటి షూటింగ్ స్పాట్ లకు టాటా చెప్పేసి ఇక కాశ్మీర్ బాట పడతారా.. అక్కడి దాల్ సరస్సుల్లో మన తెలుగు హీరో హీరోయిన్లు ఇక రోమాన్సు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారా.. ఇప్పుడు సీన్ చూస్తే అలాగే ఉంది మరి.


ఎందుకంటే.. జమ్ము, కశ్మీర్, లడక్ ప్రాంతాలలో సినిమా షూటింగ్ లు చేయడానికి ముందుకు రావాలని తెలుగు సినీ పరిశ్రమకు ప్రధాని మోడీ స్వయంగా పిలుపు ఇచ్చారు మరి. ఒక్క టాలీవుడ్ కే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రరిశ్రమలకు కూడా మోడీ స్వయంగా విజ్ఞప్తి చేశారు మరి. జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌లో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.


జుమ్మూ కాశ్మీర్‌లో పర్యాటక రంగ అబివృద్దితో పాటు సినీ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. ఒకప్పుడు అక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరుగుతుండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. హిందీ, తెలుగు, తమిళం పరిశ్రమలను కశ్మీర్‌ వరకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కొత్త పరిశ్రమలు, కొత్త వ్యవస్థల ఏర్పాటులో ప్రైవేటు సంస్థలు ప్రాధాన్యమివ్వాలని పారిశ్రామిక రంగానికి మోడీ విజ్ఞప్తి చేశారు.


జమ్మూ కాశ్మీర్‌లో ప్రతిభావంతులైన యువత ఉందన్న ప్రధాని నరేంద్ర మోడీ.. వారికి సరైన మార్గ దర్శనం చేయాలని సూచించారు. పర్యాటకం, సినీరంగంతో పాటు క్రీడారంగం కూడా అక్కడ అభివద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. కాశ్మీర్‌లో కొత్త స్పోర్ట్స్‌ అకాడమీలు, స్టేడియాలు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మరి మోడీ మాటలు నిజం కావాలంటే కాశ్మీర్ లో సెక్యూరిటీ వ్యవస్థ భద్రంగా ఉండాలి. టెర్రరిస్టుల భయం పోవాలి. మోడీ ఆ చర్యలు తీసుకుంటే.. మోడీ విజ్ఞప్తిని సినీరంగం కూడా పరిగణలోకి తీసుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: