కె.విశ్వనాథ్.. తెలుగువారి సగర్వంగా చెప్పుకునే సినీ దర్శకుడు. సంస్కృతీ సాంప్రదాయల చుట్టూ అందమైన కథలు అల్లుకుని.. వాటిని మరింత అందంగా మలచి తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలపాటు అలరించిన దర్శకుడు. అయితే ప్రతి దర్శకుడుకీ కొన్ని సెంటిమెంట్లు, అలవాట్లు ఉంటాయి. ఎంతగా సినిమా కథ ప్రకారం తీసినా.. దర్శకుడి వ్యక్తిగత అభిరుచులు ఆ సినిమాల్లో ప్రతిబింబిస్తుంటాయి.


కె. విశ్వనాథ్ విషయంలోనూ అదే జరిగింది.. తెలుగు కుటంబాలను, తెలుగు పల్లెలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన కె. విశ్వనాథ్ సినిమాల్లో అసలు ఆసుపత్రి సీన్లు కనిపించవు.. ఎక్కడో ఒకటీ అరా తప్పని సరైతే తప్ప ఆసుపత్రులు ఆయన సినిమాల్లో ఉండవు. ఇందుకు ఓ కారణం ఉంది. కె. విశ్వనాథ్ కు ఆపరేషన్ అంటే చాలా భయమట. ఆసుపత్రులు అన్నా భయమేనట.. రక్తం అన్నా భయమేనట.. అందుకే తన సినిమాల్లో ఆసుపత్రులు, ఆపరేషన్లు, రక్తం చాలా తక్కువగా కనిపిస్తాయని చెబుతున్నారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయాలను కె. విశ్వనాథ్ ఆయనతో పంచుకున్నారు. తన ఆరోగ్యం గురించి కేసీఆర్ వాకబు చేసిన సందర్బంగా విశ్వనాథ్ ఈ ఆసక్తికరమైన విషయం చెప్పారు.


‘‘ఆరోగ్యం బాగానే ఉంది. కానీ మోకాళ్ల నొప్పులున్నాయి. ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు అంటున్నారు. కానీ నాకు ఆపరేషన్ అంటే భయం. అసలు హాస్పిటల్ అంటేనే భయం. నా సినిమాల్లో కూడా ఎక్కడా ఆసుపత్రి సీన్లు పెట్టను. రక్తం అంటే భయం. ఇక నేనేమి ఆపరేషన్ చేయించుకుంటాను. ఇలాగే గడిపేస్తా.. అంటూ నవ్వుతూ సమాధనం ఇచ్చారు దర్శక దిగ్గజం విశ్వనాథ్.


సినిమాలను సమాజం అనుసరిస్తుంది అని చెప్పడానికి కె. విశ్వనాథ్ సినిమాలు ఓ ఉదాహరణ. ఆయన తీసిన శంకరాభరణం చూసి ఎందరో తమ పిల్లలను శాస్త్రీయ సంగీతం నేర్పించారు. కళలకు విశ్వనాథ్ సినిమాల్లో ఎనలేని ప్రాధాన్యం ఉండేదన్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: