దర్శకుడైన ప్రతీ ఒక్కరికి అన్ని రకాల జానర్స్ లో సినిమాలను తెరకెక్కించి తన సత్తాను చాటుకోవాలనుకుంటారు. అప్పటి వరకు సాంఘీక చిత్రాలతో తన సత్తా చాటుకున్న దర్శకుడు మధుసూదనరావుకు పౌరాణికంతోనూ ప్రేక్షకులను మెప్పించాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోనే 'వీరాభిమన్యు' సినిమాకి దర్శకత్వ అవకాశాన్ని ఏరి కోరి మరీ తీసుకుని, అభిమన్యుని కథకు నాటకీయతను   జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. 1965 ఆగస్టు 12న విడుదలయిన ఈ సినిమా 12 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకోవడమేకాకుండా, విజయవాడ మారుతి టాకీస్ లో ఏకధాటిగా 156 రోజులు ప్రదర్శితమవడం ఒక గొప్ప విశేషం. ఈ సినిమాలో శ్రీకృష్ణునిగా ఎన్.టి.ఆర్., వీరాభిమన్యుగా శోభన్ బాబు, అర్జునునిగా కాంతారావు, సుభద్రగా ఎస్. వరలక్ష్మి, ఘటోత్కచుడుగా నెల్లూరు కాంతారావు, భీముడుగా దండమూడి రాజగోపాలరావు, దుర్యోధనుడిగా రాజనాల నటించగా, కె.వి. మహదేవన్ సంగీతం అందించారు. 

అంతేకాదు ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు ఉండటం ఆసక్తికరమైన విషయం.శోభన్ బాబు కథానాయకునిగా నటించిన మొదటి సినిమా 'వీరాభిమన్యు'. ఎన్.టి.ఆర్., సిఫారసుతో 'వీరాభిమన్యు' పాత్రకు శోభన్ బాబును తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకి రెండు యూనిట్స్ పనిచేశాయట. ఒక యూనిట్ కు ఎస్. వెంకటరత్నం కెమెరామేన్ గా పనిచేయగా, విఎస్సార్ స్వామి కూడా ఈ సినిమాకి మరో ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. అయితే సినిమా మొత్తానికి రవికాంత్ నగాయిచ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫిగా వ్యవహరించి, రాయబారం సీన్ లోనూ, సినిమా పతాకసన్నివేశాల్లో కలర్ దృశ్యాలను, ఘటోత్కచుడు కింద పడిపోయిన సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ను అద్భుతంగా తెరకెక్కించారు.    

శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించే చివరి సీన్స్ లో ఎన్.టి.ఆర్. ఓ విగ్రహం లాగా నిలబడి వుండడం, అందులో  ఎఫెక్ట్స్ ను క్రియోట్ చేయడం ఇప్పటికీ ఆకట్టుకుంటుంది.యుద్ధంలో సర్ప, గరుడ, పద్మవ్యూహాల గురించి పరిశోధన చేసి అలనాటి భారత యుధ్దాలు కళ్లకు కట్టినట్టుగా  యుధ్ధ సన్నివేశాలను చిత్రీకరించడం అప్పట్లోనే ఒక గొప్ప ప్రయోగం. ఈ రకంగా చూస్తే బాహుబలి సినిమాకు చేసినన్ని ప్రయోగాలు మన పాత తరం దర్శకులు ఎప్పుడో చేశారనుకోవచ్చనమాట.  



మరింత సమాచారం తెలుసుకోండి: