లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 13 సంవత్సరాలైనా కాజల్ అందం ఏ మాత్రం తగ్గలేదు. ఒకవైపు సీనియర్ హీరోలతో నటిస్తూనే మరోవైపు కుర్ర హీరోల సినిమాలలో కూడా నటిస్తోంది కాజల్. కాజల్ హీరోయిన్ గా నటించిన రణ రంగం సినిమా నిన్న విడుదలైంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ భారతీయుడు2 సినిమాతో పాటు మంచు విష్ణు సరసన ఒక సినిమాలో నటిస్తుంది. 
 
ప్రస్తుతం కాజల్, విష్ణు నటిస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాజల్ అగర్వాల్ మంచు విష్ణుతో సెట్స్ లో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ "హ్యాపీ రాఖీ అర్జున్!" అంటూ మంచు విష్ణును ట్యాగ్ చేసింది. కాజల్ ట్యాగ్ చేయటంతో మంచు విష్ణు స్పందిస్తూ ' హాహాహా... థ్యాంక్స్ అను.. పుడ్ లేకుండా మనం కలిసి దిగిన ఒక్క ఫోటో కూడా లేదనుకుంటా ' అని సమాధానం ఇచ్చాడు. కాజల్, మంచు విష్ణు ఇద్దరూ సినిమాలోని పాత్రల పేరుతో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 
 
మంచు విష్ణు, కాజల్ జంటగా నటిస్తున్నప్పటికీ ఈ సినిమా గురించి అధికారికంగా ఏ వివరాలు తెలియటం లేదు. గత కొంతకాలంగా మంచు విష్ణు నటించిన సినిమాలేవీ హిట్ కావట్లేదు. లక్కున్నోడు, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మంచు విష్ణు ఒకేసారి నాలుగు ప్రాజెక్టులను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ అని హీరో శ్రీకాంత్ ఇందులో ప్రధాన పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. 
 
హాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ మొదలయిందని తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో హాలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నాడని సమాచారం. హాలీవుడ్ డైరెక్టర్ తో రూపొందుతున్న సినిమా తెలుగులో కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తారని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: