బాక్సులు బద్దలయాయి. రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తొమ్మిది. ఈ లక్కీ నంబర్ మెగా తనయుడిని వరించింది. చిరంజీవి కుమారుడా మజాకా అన్నట్లుగా రాం చరణ్ దూకుడు సాగిపోయింది. ఇక తండ్రిగా, సీనియర్ నటుడుగా మెగా ఆనందం అలా ఇలా ఉండదుగా. ఆ ముచ్చటను స్వయంగా చూసి చిరు పులకించిపోయారు.


సైమా మా అవార్డుల్లో మెజారిటీ రంగస్థలానికి దక్కాయి. అన్ని విభాగాలు కలులుకుని  ఏకంగా తొమ్మిది అవార్డులను రంగస్థలం గెలుచుకుంది. ఉత్తమ నటుడుగా రాం చరణ్ నిలిచి మెగా కళ్ళల్లో ఆనందం నింపారు. తాజా జరిగిన సైమా అవార్డుల ప్రదానానికి ముఖ్య అథిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.


రంగస్థలంలో చెవిటి వాడి పాత్రలో చిట్టిబాబుగా నటించిన రాం చరణ్ బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నారు. దాంతో పాటు ఈ మూవీకి రంగస్థలం చిత్రానికి సంబంధించి ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, విమర్శకుల ప్రశంసలందుకున్న నటిగా సమంత, ఉత్తమ సహాయనటిగా అనసూయ, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీప్రసాద్, ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ , ఉత్తమ గాయనిగా ఎంఎం మానసి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు, ఉత్తమ కళా దర్శకుడిగా రామకృష్ణకు అవార్డులు దక్కించుకున్నారు. 


ఈ దెబ్బతో మెగాస్టార్ కుటుంబానికి అవార్డుల కరవు తీరిపోయింది. నిజానికి చిరంజీవికి అవార్డులు కొత్త కాదు, రాం చరణ్ నటుడుగా చాలా అవార్డులు తీసుకున్నారు. అయితే ప్రాణం పెట్టి చేసిన రంగస్థలం మూవీకి అవార్డులు రాకపోవడం పట్ల మెగా ఫ్యామిలీలో అసంత్రుప్తి వ్యక్తమైంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో కూడా ఒకే ఒక అవార్డు రంగస్థలానికి వచ్చింది. ఉత్తమ నటుడు అవార్డు ఖాయమని అంతా భావించినా రాలేదు. ఇపుడు ఆ లోటు దుబాయిలో జరిగిన సైరా ఫంక్షన్ తీర్చేసింది.


ఇదిలా ఉండగా మహానటి చిత్రానికిగాను ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి కీర్తిసురేష్, ఉత్తమ సహాయ నటుడు రాజేంద్రప్రసాద్‌కు అవార్డులు లభించాయి. ఆర్‌ఎక్స్ 100 చిత్రానిగాను ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా అజయ్ భూపతి, తొలి చిత్ర నటిగా పాయల్ రాజ్‌పుత్, ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి అవార్డులు సాధించారు. విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడిగాను, సామాజిక మాధ్యమాల్లో పాపులర్ స్టార్‌గాను విజయ్ దేవరకొండ (గీత గోవిందం) రెండు అవార్డులు సొంతం చేసుకున్నాడు. 


ఉత్తమ హాస్య నటుడిగా సత్య , ఉత్తమ విలన్‌గా శరత్‌కుమార్ (నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా), ఉత్తమ తొలి చిత్ర నటుడిగా కల్యాణ్ దేవ్ (విజేత) అవార్డులు సాధించారు. మొత్తానికి అవార్డులన్నీ తెలుగులో ఘనవిజయం సాధించిన సినిమాలు సొంతం చేసుకోవడం విశేష పరిణామం. 


మరింత సమాచారం తెలుసుకోండి: