తెలుగు ‘బిగ్ బాస్’ ఆరంభం కావడానికి ముందు ఈ షో మన దగ్గర ఏమాత్రం విజయవంతం అవుతుందో అన్న సందేహాలు కలిగాయి. అయితే ఆ అనుమానాలు ప‌టాపంచ‌లు చేస్తూ బిగ్ బాస్ తెలుగు బుల్లితెర ద్వారా ప్ర‌తి ఇంటికి.. ఇంకా చెప్పాలంటే ఫోన్ల‌తో ప్ర‌తి వ్య‌క్తికి వెళ్లిపోయింది. బిగ్‌బాస్‌కు తెలుగులో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఫాలోయిర్లు వ‌చ్చేశారు. ఈ క్ర‌మంలోనే మ‌గ‌, ఆడ‌, వృద్ధులు, యువ‌త, ఫ్యామిలీస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తి ఒక్క‌రు ఈ షోను విర‌గ‌బ‌డి చూశారు. దీనికి తోడు తొలి సీజ‌న్లో టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా రావ‌డంతో ఈ షోకు విప‌రీత‌మైన టీఆర్పీ రేటింగ్స్ వ‌చ్చాయి.


ఎన్టీఆర్ తొలి సీజ‌న్ హోస్ట్‌గా రావ‌డంతో షో జ‌నాల‌కు బాగా ఎక్కేసింది. ఇక రెండో సీజ‌న్‌కు నాని హోస్ట్‌గా వ‌చ్చారు. నాని ఎన్టీఆర్ రేంజులో కాక‌పోయినా మెప్పించాడు. ఇక కౌశ‌ల్ హంగామాతో రెండో సీజ‌న్‌కు కొత్త ఊపు వ‌చ్చింది. తొలి సీజ‌న్‌ పార్టిసిపెంట్లు కూడా తమ స్థాయిలో షోను బాగానే రక్తి కట్టించారు. రెండో సీజ‌న్లో కూడా నాని జ‌స్ట్ ప‌ర్వాలేద‌నిపించాడు. హౌస్‌లో రసవత్తర పోరాటాలు సాగడం.. సోషల్ మీడియా మోతెక్కిపోవడంతో షో సూపర్ హిట్టయింది.


మూడో సీజన్‌ మరింత రసవత్తరంగా ఉంటుందని ఆశిస్తే చాలా నిరుత్సాహ ప‌రుస్తోంది. నాగ్ మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనుభ‌వంతో షోను ర‌క్తిక‌ట్టిస్తాడ‌నుకుంటే అస్స‌లు తేలిపోతున్నాడు. ఎన్టీఆర్ కంటే నాగ్ చాలా సీనియ‌ర్. ఎన్టీఆర్‌ను మించి నాగ్ షోకు క్రేజ్ తీసుకు వ‌స్తాడ‌నుకుంటే పార్టిసిపెంట్లను కమాండ్ చేయడంలో, స్పాంటేనిటీతో వినోదం పండించడంలో నాగ్ విఫలమవుతున్నాడు. దీనికి తోడు పార్టిసిపెంట్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు.


ఇప్ప‌టికే రెండు వైల్డ్ కార్డు ఎంట్రీలు వ‌చ్చినా రెండు అట్ట‌ర్ ప్లాప్ అయ్యాయి. ఇక రేటింగులు ఘోరంగా ప‌డిపోతున్నాయి. కార్తీక‌దీపం లాంటి సీరియ‌ల్స్ రేటింగుల్లో దూసుకుపోతుంటే బిగ్‌బాస్ వెన‌క‌ప‌డిపోతుండ‌డంతో నిర్వాహ‌కులు సైతం ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇక విశ్లేష‌కులు సైతం బిగ్‌బాస్ 3 అట్ట‌ర్ ప్లాప్ దిశ‌గా వెళుతోంద‌నే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి నిర్వాహ‌కులు ఇంకా స‌గం షో మిగిలి ఉండ‌డంతో ఏదైనా క్రేజ్ తీసుకు వ‌చ్చే ప్లాన్ చేస్తారేమో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: