నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ అవడంతో చాలా రోజుల తర్వాత బన్ని త్రివిక్రమ్ తో సినిమా కమిటయ్యాడు. అయితే ఈసారి పూర్తిగా త్రివిక్రమ్ మేజిక్ పైనే ఆధారపడాలని బన్నీ నిర్ణయించుకున్నట్టున్నాడట. సినిమా స్టార్ట్ అయినప్పట్నుంచి ఈ విషయంలో జనాలకి అనుమానాలున్నాయి. అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి విడుదలవుతున్న పోస్టర్లలో బన్నీ కనిపిస్తున్నప్పటికీ, అంతా త్రివిక్రమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అదే మాటల మాంత్రీకుడి మ్యాజిక్. 

జనవరి 12న సినిమా రిలీజ్ అంటూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో వచ్చిన అల వైకుంఠపురములో మూవీ పోస్టర్ కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. చుట్టూ పచ్చని చెట్ల మధ్య హీరో కోడి పుంజుని పట్టుకుని పందానికి వస్తున్నట్టు ఈ పోస్టర్ కనిపిస్తోంది. తలకి తుండుగుడ్డ, కలర్ ఫుల్ షర్ట్, గాగుల్స్ తో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. కానీ త్రివిక్రమ్ క్రియేటివిటీ చాలా బాగుందని మెచ్చుకునే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. బన్నీ లుక్ లో కొత్తదనం అంతా త్రివిక్రమ్ మేజిక్ అని అంటున్నారు.

పాట మినహా ఇప్పటి వరకూ సినిమాకి సంబంధించి రిలీజైన అన్ని స్టిల్స్ వేటికవే డిఫరెంట్ గా ఉన్నాయి. కారు పక్కన చెక్క స్టూల్ పై కూర్చుని బీడీ కాలుస్తూ రఫ్ గా కనిపించే పోస్టర్ లో హీరోని పరిచయం చేసిన త్రివిక్రమ్, ఆ తర్వాత  మరో స్టిల్ వదిలాడు. తాజాగా సంక్రాంతి ఫ్లేవర్ తో ఈ స్టిల్ వచ్చింది. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ విడుదలైన ఈ స్టిల్స్ అన్నీ బన్నీ స్టయిల్ కంటే, త్రివిక్రమ్ మార్క్ ను ఎక్కువగా ఎలివేట్ చేస్తున్నాయని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది.

నిజానికి త్రివిక్రమ్ సినిమాల్లో బన్నీ తన మార్క్ చూపించాలని ఎప్పుడూ అనుకోలేదు. జులాయిలో బన్నీ స్టయిల్ కంటే త్రివిక్రమ్ టేకింగ్, డైలాగ్సే ఎక్కువగా కనిపించాయి. ఇక సన్నాఫ్ సత్యమూర్తిలో అయితే త్రివిక్రమ్ చెప్పింది ఫాలో అయి అలా చేసుకుపోయాడని అనిపిస్తుంది. ఈ రెండు సినిమాల మాదిరిగానే అల వైకుంఠపురములో మూవీ కూడా ఉంటుందని, బన్నీ స్టయిల్ కంటే త్రివిక్రమ్ మార్కు ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. వాటికి ఉదాహరణలుగా ఇప్పటివరకు వచ్చిన 3 పోస్టర్ల డిజైన్ చూస్తే అర్థమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: