ఇప్పటి మన  స్టార్ హీరోలు  ఒకే ఏడాది  ఒక్క  సినిమాకి మాత్రామే పరిమితం అయిపోయారు.  నిజానికి  ఫలానా స్టార్ హీరో నుండి  ఖచ్చితంగా ఏడాదికి  ఒక సినిమా వస్తుందని ఇప్పుడు నమ్మకంగా చెప్పలేం.  ఇప్పటి పరిస్థితుల్లో అలా చెప్పడం  నిజంగా  అతిశయోక్తే !  కానీ ఆ రోజుల్లో ఎన్టీఆర్,  ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌ బాబు లాంటి  స్టార్‌ హీరోలంతా  జయాపజయాలకు అతీతంగా  ఏడాదికి ఏడు ఎనిమిది  సినిమాలు చేసేవాళ్ళు.  సూపర్ స్టార్  కృష్ణ అయితే  ఓ ఏడాది ఏకంగా పదిహేను సినిమాలకు పైగానే చేశారట. ముఖ్యంగా  1964 నుంచి 1995 వరకు సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశారు. ఒక్క కృష్ణనే కాదు  అప్పటి హీరోలందరూ రోజుకి  మూడు, నాలుగు  కాల్షీట్లు ఇచ్చేవాళ్లు.  కానీ  ఇప్పటి  స్టార్స్‌  గ్యాప్ లేకుండా  రోజుకి ఒక్క కాల్షీట్‌  ఇవ్వడం..  గగనమే.   పెద్ద హీరోలు  ఎక్కువ సినిమాలు చెయ్యడం వల్ల  మూస ధోరణికి  బ్రేక్‌ వేస్తూ..  సరికొత్త  ప్రయోగాలు  ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ..  స్టార్ల అనే  ఇమేజ్‌ చట్రాల మధ్య నలిగిపోకుండా  అన్ని వర్గాల ప్రేక్షకులనూ  ఆకట్టుకోవచ్చు.  


సినిమా సినిమాకి  అభిమానులనూ  పెంచుకోవచ్చు.  ఎన్టీఆర్ ఇలానే చేశారు. 'పాతాళ భైరవి' లాంటి ఆల్ టైం మాస్ ఫిల్మ్ చేసాక కూడా.. 'పిచ్చి పుల్లయ్య'  'కలసి ఉంటే కలదు సుఖం' లాంటి అచ్చ కుటుంబ కథా చిత్రాలతో  వెండి తెర పై  తెలుగు కమ్మదనాన్ని అద్దారు.  తెలుగు ప్రేక్షకులకు మధురమైన చిత్రాలను అందించారు.  ఎన్టీఆర్ తో పాటూ   ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు తదితర స్టార్‌ లంతా ఎక్కువ సినిమాలు చెయ్యడం వల్లే  విభిన్నమైన పాత్రల్లో అద్భుతమైన చిత్రాల్లో నటించి తమకంటూ ఒక బాణీని ఏర్పర్చుకున్నారు.  అందుకేనేమో  అప్పటి హీరోల్లో ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక శైలి ఉంటుంది.  మరి ఇప్పటి హీరోల్లో..?  వాస్తవం మాట్లాడుకుంటే  సగంమందిది ఒకటే శైలి కదా !.  కారణం..  పదేళ్ల కెరీర్ లో పట్టుమని పది సినిమాలు కూడా చెయ్యలేకపోవడం.  అదే  ఎక్కువ సినిమాలు చేస్తే.. వాటిల్లో  ఎదొక సినిమా సూపర్  హిట్ అవుతుంది. నటనలోనూ మెరుగవుతారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: