టాలీవుడ్ పెద్దలు ఏపీ వైపు చూడరు, అసలు పట్టించుకోరు. అయిదేళ్ళ క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ విషయంలో కనీస బాధ్యత తీసుకోరు. ప్రత్యేక హోదా వంటి పోరాటాలకు అసలు ముందుకు రారు. తమ సినిమాలు, కోట్ల ఆదాయం, హ్యాపీ లైఫ్. ఇప్పటికీ అక్కడే స్టూడియోలు కట్టుకుని కాలం గడుపుతున్నారు. పైగా ఇక్కడ సినిమా థియేటర్లలో రేట్లు పెంచి మరీ తమ సినిమాలు ఆడించుకుని కోట్లు దండుకుంటున్నారు. మరి టాలీవుడ్ కి లేని  ప్రేమ ఏపీకి కూడా ఎందుకుండాలి.


ఇది సామాన్యుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. నిన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి జగన్ని కలసిన సందర్భంగా ప్రస్తావించిన వాటిలో నంది అవార్డులు కూడా ఉన్నాయి. వాటిని అయిదేళ్ళ చంద్రబాబు తన పాలనలో పూర్తి చేయలేదు, మీరైనా ఇవ్వండని చిరంజీవి కోరినట్లుగా సమాచారం వచ్చింది. దానికి జగన్ అధికారులను ఆదేశిస్తానని కూడా చెప్పినట్లుగా భోగట్టా. సరే కళాకారులను గౌరవించుకోవాలి. అవార్డులు ఇవ్వాలి. ఇంతవరకూ బాగానే ఉన్నా అసలు నంది అవార్డులు ప్రజల కట్టిన  పన్ను సొమ్ముతో ఇవ్వాలి. మరి ఏపీ ప్రజలకు తెలుగు కళాకారుల వల్ల ఒరిగిందేంటన్నది పెద్ద ప్రశ్న. వినోదం ఇస్తున్నామని అంటారు. ఆ వినోదం ఇపుడు టీవీలు పెడితే ఇంకా బోలెడు దొరుకుంది. వారందరికీ అవార్డులు ఇవ్వడంలేదుగా. అయినా డబ్బు తీసుకుని నటిస్తున్న వారికి అవార్డులు అవసరమా అన్న మాట కూడా ఉంది.


ఇక మరో వైపు ఏపీకి సంబంధించి టాలీవుడ్ పెద్దలు ఏం చేశారన్న ప్రశ్న కూడా ఉంది. ప్రత్యేక హోదా అంటే ఒక్క నటుడు వచ్చి మద్దతు ఇవ్వలేదు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం వస్తే టాలీవుడ్  ప్రముఖ నటుడు ఒకరు  ట్వీట్ చేసి మరీ మద్దతు ఇచ్చాడు. అంటే ఏపీ వాళ్ళు అంటే అంత చులకన అన్న మాట. ఏపీలో సరైన రాజధాని లేదు, ప్రజలు హుదూద్ తుపాన్ల బారిన పడుతున్నారు. రాజధాని అంతకంటే లేదు. మరి అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్ర జనానికి టాలీవుడ్ నటులు ఇస్తున్నదేంటి అంటే జవాబు లేదు.


అదే సమయంలో అక్కడే భారీ నివాసాలు, స్టూడియోలు ఏర్పాటు చేసుకుని మరీ సినీ పెద్దలు స్థిరపడ్డారు. పన్నులు అక్కడే కడుతున్నారు. మరి ఏ విధంగా చూసినా పైసా ఆదాయం కూడా వారి నుంచి రాదు, అటువంటి టైంలో నంది అవార్డులు ఎందుకు ఇవ్వాలి అన్న ప్రశ్న వస్తోంది. ఆదాయం అంతా తెలంగాణాకు దోచిపెడుతున్న టాలీవుడ్ పెద్దలు ఆ అవార్డులు కూడా అక్కడి ప్రభుత్వం నుంచే తీసుకుంటే పోతుంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: