ఒకప్పుడు స్టార్ సినిమా ఛాన్స్ రావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అయితే ఇప్పటికి ఆ కష్టం ఉంటుంది. స్టార్ హీరోలతో సినిమా అంటే దర్శకుడు అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన దర్శకులు కూడా స్టార్ డైరక్టర్స్ అవుతారు. అయితే ఈమధ్య యువ దర్శకులు కూడా తమ టాలెంట్ తో సత్తా చాటుతున్నారు.


అందుకే మొదటి రెండు సినిమాలు చిన్న సినిమాలు చేసినా సడెన్ గా స్టార్ హీరోల ఛాన్సులు అందుకుంటున్నారు. ఈ కోవలోనే పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చేలా ఉన్నాడు. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ త్వరలో వెంకటేష్ తో ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. వెంకటేష్ తో ఛాన్సే లక్కీ అనుకుంటుంటే ఈసారి ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తా అంటున్నాడు తరుణ్ భాస్కర్.


ఈమధ్యనే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను కలిసి తరుణ్ భాస్కర్ ఓ కథ చెప్పాడట. లైన్ నచ్చడంతో స్క్రిప్ట్ డెవలప్ చేయమని చెప్పాడట తారక్. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తా సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ కు లైన్ చెప్పిన విషయాన్ని బయట పెట్టాడు తరుణ్ భాస్కర్. అయితే వెంకీ సినిమా కనుక హిట్టైతే తరుణ్ భాస్కర్ డెవలప్ చేసిన స్టోరీ ఎన్.టి.ఆర్ కు నచ్చితే ఈ కాంబో సెట్ అయినట్టే.  


ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి తారక్ ఈ సినిమా తర్వాత ఎవరితో చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: