నితిన్, రష్మిక జంటగా ఛలో ఫేం వెంకీ కుడుముల డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా భీష్మ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

 

భీష్మ ఆరానిక్స్ సి.ఈ.ఓ అయిన భీష్మ (అనంత్ నాగ్) తన వారసుడి కోసం వెతుకుతాడు. అలాంటి టైంలో జూనియర్ భీష్మ (నితిన్) అతని కంటపడతాడు. అయితే ఆ కంపెనీకి సి.ఈ.ఓగా జూనియర్ భీష్మ ఉండాల్సి వస్తుంది. ఇంతకీ జూనియర్ భీష్మ ఆ కంపెనీ సి.ఈ.ఓ గా ఉండాల్సిన అవసరం ఎందుకొచ్చింది. జూనియర్ భీష్మ లైఫ్ లో చైత్ర (రష్మిక) ఎలా వచ్చింది. ఆమెతో భీష్మ ప్రేమ ఎలా సాగింది.. కంపెనీ సి.ఈ.ఓ గా జూనియర్ భీష్మ ఏం చేశాడు అన్నది సినిమా కథ.

 

విశ్లేషణ :

 

కొంతమంది సినిమా కథ బాగా రాసుకుని దానితో ప్రేక్షకుల మనసు గెలుస్తారు. కొంతమంది మాత్రం రొటీన్ కథతోనే వచ్చినా వాళ్లకి ఉన్న స్ట్రెంత్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తారు. లేటెస్ట్ గా వచ్చిన భీష్మ సినిమా కూడా రెండో కేటగిరికి చెందిందని చెప్పొచ్చు. భీష్మ సినిమా కథ చాలా రొటీన్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలానే ఈ సినిమా కథ కూడా అందరికి తెలిసినట్టుగా ఉది. కాని స్క్రీన్ ప్లే మాత్రం వెంకీ తన మార్క్ చూపించాడు.

 

సినిమా చూస్తున్నంతసేపు ఎంటర్టైన్ గా అనిపిస్తుంది. ఎక్కడ బోర్ కొట్టిన ఫీలింగ్ ఉండదు. ఛలో తరహాలో కామెడీతో ఈ సినిమాను గట్టెక్కించేశాడు వెంకీ కుడుముల. ఎంచుకున్న కథ పాతదే అయినా దానికి కొత్త కలర్ అద్ది దించాడు. పాత్రల స్వభావాలు కూడా కొత్తగా ఉన్నాయి. ఫ్రెష్ కామెడీతో సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా తీశాడు వెంకీ కుడుముల. 

 

ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుందని అనుకోగా సెకండ్ హాఫ్ కామెడీతో పాటుగా కమర్షియల్ ఎలిమెంట్స్ కు కావాల్సిన ఫైట్స్ కూడా పెట్టాడు. నితిన్ ఈ సినిమాలో అన్ని యాస్పెక్ట్స్ లో కుమ్మేశాడు. అయితే కథ పాతదే అయినా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద డైరక్టర్ చెప్పిన పాయింట్ కూడా బాగుందని చెప్పొచ్చు. ఫైనల్ గా సంక్రాంతి సినిమాల తర్వాత సరైన హిట్ సినిమాలేదని అనుకుంటున్న తెలుగు ఆడియెన్స్ కు భీష్మ ఫుల్ ఎంటర్టైన్ చేయడం ఖాయం. ఫ్యామిలీ, యూత్ అందరు మెచ్చే సినిమా భీష్మ.

 

నటీనటుల ప్రతిభ :

 

భీష్మ పాత్రలో నితిన్ బాగా చేశాడు. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ పార్ట్ లో కూడా స్టైలిష్ గా ఉన్నాడు. డ్యాన్స్ విషయంలో కొద్దిగా కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. భీష్మగా నితిన్ పెర్ఫెక్ట్ అనిపించాడు. రష్మిక కూడా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. సినిమాకు ఆమె గ్లామర్ చాలా ప్లస్ అయ్యింది. డ్యాన్స్ లో కూడా రష్మిక అదరగొట్టింది. ఇక సినిమాలో వెన్నెల కిశోర్, రగుబాబు, హెబ్బా పటేల్, సంపత్, నరేష్, జిస్సు సేన్ గుప్తా విలనిజం కూడా బాగుంది.

 

సాంకేతికవర్గం పనితీరు :

 

భీష్మ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కెమెరా వర్క్ చాలా నీట్ గా అనిపిస్తుంది. నితిన్, రష్మికలను బాగా చూపించారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ సినిమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మ్యూజిక్ పరంగా కూడా సినిమా పాజిటివ్ బజ్ ఏర్పరచుకుంది. కథ రొటీన్ గా ఉన్నా డైరక్టర్ వెంకీ కుడుముల స్క్రీన్ ప్లేతో ఇంప్రెస్ చేశాడు. ఫ్రెష్ కామెడీతో సినిమా ఆద్యంతం ఎక్కడ బోర్ కొట్టకుండా తన ప్రతిభ చాటాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :

 

నితిన్

రష్మిక

కామెడీ

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

 

మైనస్ పాయింట్స్ :

 

రొటీన్ స్టోరీ

అక్కడక్కడ ల్యాగ్ అవడం

 

బాటం లైన్ :

 

నితిన్ భీష్మ.. పైసా వసూల్ మూవీ..!

 

రేటింగ్ : 3/5

మరింత సమాచారం తెలుసుకోండి: