నిర్మాత: ఉమాదేవి , సహా-నిర్మాత: సూర్య నారాయణ ఆకుండి 
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల ,  బాక్ గ్రౌండ్ స్కోర్: పవన్ కుమార్ 
దర్శకత్వం : రామ రాజు 

ఉపోద్ఘాతం: 
ముందుగానే చెబుతున్నా..సినిమా అంటే ఆరు పాటలు, మూడు ఫైట్లు, రెండు గంటల కాలక్షేపం అనుకునేవారు ఈ సినిమా జోలికి రాకండి..హాయిగా టీవీ సెట్ల ముందు కూర్చుని, అలాంటి సినిమాలు చాలా వస్తుంటాయి..చూసుకోండి. కానీ ఒక్క మాట..మంచి మాటలు, పాటలు, మానవ సంబంధాలపై చర్చలు, వీటన్నింటితో అల్లిన దృశ్యకావ్యం చూడాలంటే, రండి. థియేటర్లో మీరు మిమ్మల్ని మరిచిపోతారు.

సినిమా భాష ఏదయనా తెరపై జీవితాన్ని పరిచేసినపుడు, తెరపై కదిలే పాత్రలు మనల్ని నిలదీసినపుడు, కొంచెం గుండె పట్టినట్లవుతుంది. కానీ దానిని అనుభవించి పలవరించగల మనసు కావాలి. అది వుంటే మల్లెలతీరంలో సిరిమల్లె పూవు ..సినిమా మిమ్మల్ని కొన్నాళ్లు వెంటాడుతుంది. మల్లెలతీరంలో సిరిమల్లెపూవు సినిమాలో కథేమీ పెద్దగా లేదు. నాలుగైదు పాత్రల నడుమ నడిచే పిల్ల కాలువలాంటి కథ. కానీ దాని లోతు గోదారి అంత.

మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు : చిత్ర కథ 

లక్ష్మి [శ్రీదివ్య] ఓ అచ్చమైన తెలుగింటి ఆడపిల్ల జీవితమే ఈ చిత్ర కథ. సాంప్రదాయబద్దంగా పెరిగిన లక్ష్మికి తండ్రి [రావురమేష్] లైఫ్ లో సెటిల్ అయిన మంచికుర్రాడు, మంచి ఉద్యగం, జాతకాలు కలిసిన అబ్బాయి [జార్జి] కి ఇచ్చి పెళ్లి చేస్తాడు, అబ్బాయిలో లోపాలు ఏమి లేకపోవడంతో లక్ష్మి కూడా పెళ్ళికి ఒప్పుకుంటుంది. లక్ష్మి అందరు అమ్మాయిల్లాగే కోటి కలలతో భర్త ఇంట అడుగుపెడుతుంది. భర్త చాలా చిత్రమైన వాడు, బతికి చెడిన కుటుంబానికి చెందినవాడు. ఎలాగైనా మళ్లీ డబ్బు సంపాదించాలనే తపన తప్ప, భార్య చిన్న చిన్న ముచ్చట్లు పట్టనివాడు. తను చేసే ప్రతి విషయాన్నిడబ్బుతో ముడి వేసే భర్త ప్రవర్తన నచ్చకపోయినా లక్ష్మి సాంప్రదాయానికి గౌరవమిస్తూ అతనితోనే ఉండిపోతుంది, అలాంటి సమయంలో ఆమె ఓ గేయరచయిత క్రాంతి [క్రాంతి] కి మానసికంగా దగ్గరవుతుంది. మరి లక్ష్మి ప్రేమను క్రాంతి ఒప్పుకున్నాడా? లక్ష్మి తన భర్తతో సర్దుకుపోయిందా లేక విడిపోయిందా ? చివరకు ఆమె పయనం ఎక్కడ ఆగిందన్నది మిగిలిన కథ.

మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు : నటీ నటుల ప్రతిభ 
లక్ష్మి పాత్రలో శ్రీదివ్య ఇట్టే ఒదిగిపోయింది. పదహారణాల తెలుగు ఆడపడచు లాంటి తన నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయ్యింది. అచ్చతెనుగు అమ్మాయిగా ఆమె ఆహార్యాన్ని తీర్చిదిద్దడంలో దర్శకుడి శ్రద్ధ మెచ్చకోతగ్గది. ఆమె తరువాత క్రెడిట్ రావు రమేష్ ది, రావు రమేష్ తనదయిన శైలి లో ఆకట్టుకున్నారు. క్రాంతి పాత్ర పోషించిన వ్యక్తి చాల బాగా నటించాడు. అలానే లక్ష్మి భర్త పాత్ర పోషించిన నటుడు కూడా పాత్రకు తగ్గ న్యాయం చేశారు నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో కనిపించే ప్రతి నటుడు మనస్పూర్తిగా నటించినట్టు కనిపిస్తుంది.  ఈ చిత్రంలో పాత్రలు తక్కువగా ఉన్నా వాటిని తీర్చి దిద్దిన విధానం అద్భుతంగా ఉంది . ముఖ్యంగా క్రాంతి మరియు లక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యేలా ఉన్నాయి అలానే రావు రమేష్ మరియు లక్ష్మి మధ్య సన్నివేశాలు మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ఈ సన్నివేశాలలో శ్రీ దివ్య చాల బాగా నటించింది.  

మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు : సాంకేతిక వర్గం 
సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా వుంది. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్ గురించి, "ఆకాశానికి, మనసుకు హద్దులు గీయలేం.. స్వేచ్ఛ గురించి మనిషి గొప్పగా మాట్లాడతాడు..కానీ ఇవ్వడానికే వెనుకాడతాడు..నువ్వు కావాలనే కోరికలో నన్ను నేను మరిచిపోయాను..వెనక్కు తిరిగి చూసుకుంటే నేను లేనే లేను... ఇలా ఎన్ని మాటల ముత్యాలని ఏరుకోవడం"... ఈ చితానికి ప్రధాన ఆకర్షణ డైలాగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఒక అందమయిన కావ్యానికి దృశ్యరూపం ఇచ్చారని చెప్పచ్చు. ఒక్కో ఫ్రేం ని పెయింట్ చేసినంత అందంగా తెరకెక్కించారు సినిమాటోగ్రాఫర్.  నిజానికి తక్కువ లొకేషన్ లలో చిత్రీకరించినా సగటు ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్ కలగకుండా చెయ్యడంలో సినిమాటోగ్రాఫర్ పాత్ర చాలా ఉంది.  సంఘటనలను జీర్ణించుకుని పవన్ అందించిన నేపథ్యసంగీతం సమ్మోహనంగా వుంది. పాటలు కూడా మూడ్ కు తగ్గట్లు ట్యూన్ చేసాడు.సంగీత దర్శకుడు దర్శకుడి కథకు ప్రాణం పోశారు. 

కథ, మాటలు,స్ర్కిప్టు అందించిన దర్శకుడు రామరాజు అన్నింటా తానై కనిపించాడు. నిజానికి సినిమా స్రిప్టు నాటకాల స్టయిల్ ను పోలి వుంటుంది. అలా ఇద్దరి నడుమ, ఒకే చోట, రీలు మీద రీలుగా సన్నివేశాలు నడుస్తూనే వుంటాయి. ఒక దశలో ఏముంది సినిమాలో అనిపించే ప్రమాదం వుంది. అయితే అక్కడే దర్శకుడు మాటలతో మాయచేసాడు. ఇద్దరి నడుమ సన్నిహితత్వాన్ని, సంఘర్షణను, చిన్న చిన్న పదాల్లో రంగరించిన మాటలను అందించాడు. సెన్సిటివ్ కథను ఎంచుకున్న దర్శకుడు కథనం విషయంలో బాలెన్స్ గా ఉండటానికి ప్రయత్నించాడు దీనివలన కథనం చాలా నెమ్మదిస్తుంది. కొన్ని సన్నివేశాలను ఎడిటర్ కత్తిరించి ఉండాల్సింది. అచ్చమయిన తెలుగుదనాన్ని తెర మీద ఆవిష్కరించడంలో దర్శకుడు సఫలం అయ్యారు. 

హైలైట్స్ : 
  బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ,
  అద్భుతమైన డైలాగ్స్,
  వినసొంపైన సంగీతం  
  శ్రీదివ్య నటన, ట్రెడిషనల్ లుక్ 
  డైరెక్టర్ రామరాజు స్టొరీ లైన్ మరియు టేకింగ్ 

డ్రా బాక్స్ :
  కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన కామెడీ, రొమాన్స్, ఫైట్స్ లాంటివి ఏమీ లేకపోవడం. 
  సినిమా నిధానంగా సాగడం,
  కొన్ని చోట్ల ఆ సన్నివేశమే అనవసరం అనుకుంటుంటే, వాటిని ఇంకాస్త సాగదీయటం.

మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు : విశ్లేషణ
చిన్న లైన్ కథ. జనానికి,సమాజానికి ఎదురీదాల్సిన కథ. ఓ అమ్మాయి మానసిక సంఘర్షణ. భర్త మంచివాడు కాదా..అంటే మంచివాడే..కొట్టలేదు..తిట్టలేదు. కావాల్సినంత ధనం సంపాదిస్తాడు.. ఆమె పేరిటే అన్ని ఆస్తులూనూ.. కానీ ఆమె మనసు తెలుసుకుని మసలకపోవడం ఓక్కటే అతగాడి తప్పు. పెళ్లయిన అమ్మాయిగా ఆమె వేరొకరికి మానసికంగానైనా దగ్గరై తప్పు చేసిందా అంటే, అంతకు అంతా మానసిక సంఘర్షణ మన కళ్ల ముందు నడుస్తుంది. నిజానికి ప్రేమికురాలిగా ఆమెను ఎలివేట్ చేసినంతగా, దర్శకుడు ప్రేమికుడైన క్రాంతిని మన ముందుకు తేలేకపోయాడు. అసలు ఆ మాటకు వస్తే, క్రాంతి ప్రేమను ప్రదర్శించడం కానీ, ఆమె పట్ల జాలిపడ్డాడా అన్నది కానీ చూపించలేదు. కేవంల ఓ అమ్మాయి మానసిక సంఘర్షణపైనే దృష్టి అంతా పెట్టాడు. అదే సమయంలో భర్త పాత్రను, తండ్రి పాత్రను మాత్రం సరిగ్గా తీర్చిదిద్దాడు. కానీ అమ్మాయి పాత్రపై ప్రేక్షకుల సానుభూతి పెరగాలనేమో, భర్త పాత్రను మెటీరీయలిస్టుగా తీర్చిదిద్దుతూనే మొరటుతనం కూడా చేర్చాడు. 

"అద్వైతం" అనే అంశం చుట్టూ తిరిగే ఈ చిత్రం అందం అభినయాల అద్వైతం అని చెప్పుకోవచ్చు. గ్లామర్ అనే ఉచ్చులో చిక్కుకున్న అందానికి ఈ చిత్రంతో దర్శకుడు నిజమయిన అర్ధం చెప్పారు. మనసుకి హత్తుకునే అంశాన్ని వింటే ఆ అనుభూతి ఎవరినయినా అద్భుతంగా నటింపజేస్తుంది అని ఈ చిత్రం చూసాక తెలుస్తుంది. 
కానీ వాణిజ్య అంశాలు లేని ఈ చిత్రాన్ని ఎంతమంది చూస్తారు, నిజమే కామెడి లేని కావ్యం ఎవరికి కావాలి. తెలుగుదనాన్ని చెప్పే తెలుగు చిత్రాన్ని ఎవరు చూస్తారు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ఒక సాధారణ గృహిణి జీవితానికి సంబంధించిన ఈ కథ ని టేక్-అప్ చెయ్యడానికి దర్శకుడి కంటే నిర్మాత కి ఎక్కువ ధైర్యం ఉండాలి.  బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం గెలిచే చాన్స్ లు తక్కువ ఉన్నాయి కానీ ప్రతి ప్రేక్షకుడి మదిని మాత్రం గెలుచుకుంటుంది. తెలుగుదనం ఉన్న తెలుగు చిత్రాలను చూడాలి అనుకునే వారు ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం ఇది.
చివరి మాట : మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు... అచ్చ తెలుగు సినిమా.

PS: మళ్లీ మరోసారి విన్నపం... మీకు కృష్ణశాస్ర్తి కవిత, బాపు బొమ్మలు, చలం కథానాయికలు ఇలాంటివి నచ్చితేనే ఈ సినిమా చూడండి. సినిమా అంటే ఓ ఎత్తుగడ, నడక, ముగింపు అనే పడికట్టు సూత్రాలపై నమ్మకం వుంటే వదిలేయండి..ప్లీజ్.

Mallela Theeram Lo Sirimalle Puvvu
Mallela Theeram Lo Sirimalle Puvvu Review | Mallela Theeram Lo Sirimalle Puvvu Rating | Mallela Theeram Lo Sirimalle Puvvu Movie Review | Mallela Theeram Lo Sirimalle Puvvu Movie Rating | Mallela Theeram Lo Sirimalle Puvvu Telugu Movie Cast & Crew on APHerald.com
Directed by: G.V.Rama Raju
Starring:
Sri Divya
Kranthi
G.V.S.Raju

మరింత సమాచారం తెలుసుకోండి: